కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే.. ప్రతిగా 50 మంది బందీల విడుదల

  • ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం
  • 4 రోజులు యుద్ధానికి విరామం ప్రకటించనున్న నెతన్యాహు
  • రిలీఫ్ మెటీరియల్ తో వచ్చిన ట్రక్కులకు గాజాలోకి అనుమతి
ఇజ్రాయెల్- హమాస్ మధ్య నలభై ఆరు రోజుల నుంచి సాగుతున్న యుద్ధానికి స్వల్ప విరామం ప్రకటించేందుకు ఇజ్రాయెల్ క్యాబినెట్ అంగీకరించింది. నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు ఆమోదం తెలిపింది. అయితే, ఇది తాత్కాలిక విరామమేనని, యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ మిలిటెంట్లను తుదముట్టించాలనే లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు. కాల్పుల విరమణకు ప్రతిగా తమ వద్ద ఉన్న బందీలలో 50 మందిని విడుదల చేసేందుకు హమాస్ మిలిటెంట్లు ఒప్పుకున్నారు. 

ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. ప్రతీ రోజూ పదిమంది చొప్పున బందీలను విడుదల చేయాలని, నాలుగవ రోజు 20 మందిని విడుదల చేయాలని ఇజ్రాయెల్ పెట్టిన షరతుకు హమాస్ మిలిటెంట్లు అంగీకరించారు. బుధవారం ఉదయం హమాస్ విడుదల చేసిన స్టేట్ మెంట్ ప్రకారం.. ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న 150 మంది పాలస్తీనియన్లకు విముక్తి కలగనుందని తెలిపారు. దీంతోపాటు రిలీఫ్ మెటీరియల్ తీసుకొచ్చిన ట్రక్కులను గాజాలోకి అనుమతించేలా ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కాగా, ఖతార్, అమెరికా మధ్యవర్తిత్వం వహించి హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య ఈ ఒప్పందం కుదిర్చాయి.


More Telugu News