టీమిండియాతో ప్రధాని మోదీ ‘పెప్‌టాక్’.. విరుచుకుపడుతున్న విపక్షాలు

  • ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత ఆటగాళ్ల డ్రెస్సింగ్‌ రూములోకి మోదీ
  • ఆటగాళ్లలో ధైర్యం నూరిపోసి స్ఫూర్తినింపే ప్రయత్నం
  • డ్రెస్సింగ్ రూములోకి వెళ్లడం ఏంటని విపక్షాల ప్రశ్న
  • మీరైతే మీ బెడ్‌రూములోకి రానిస్తారా? అంటూ మండిపాటు
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లీగ్ దశ నుంచి  ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకున్న జట్టు ఒకే ఒక్క ఓటమితో ట్రోఫీని చేజార్చుకుంది.  ఓటమి అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ టీమిండియా డ్రెస్సింగ్ రూములోకి వెళ్లి ఆటగాళ్లలో ధైర్యం నూరిపోసి, స్ఫూర్తి నింపే ప్రయత్నం (పెప్‌టాక్) చేశారు. 

ఇప్పుడీ పెప్‌టాక్‌పై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆటగాళ్లు అసౌకర్యంగా కనిపిస్తుంటే ప్రధాని మోదీ తగుదునమ్మా అంటూ కెమెరాతో వారి డ్రెస్సింగ్ రూములోకి వెళ్లి ‘పెప్‌టాక్’ చేశారంటూ ఎక్స్ ద్వారా విమర్శలు గుప్పించారు. అంతేకాదు, కావాలంటే మీకు ఇష్టమున్నంత వరకు ఈ ట్వీట్‌ను ట్రోల్ చేసుకోవచ్చంటూ ట్రోలర్స్‌ను ఉద్దేశించి సూచించారు. 

టీఎంసీ నాయకుడు, 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్ కూడా మోదీ పెప్‌టాక్‌ను తప్పుబట్టారు.  డ్రెస్సింగ్ రూము అనేది ఏ జట్టుకైనా చాలా పవిత్ర స్థలమని, ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ తప్ప ఐసీసీ మరెవరినీ దాంట్లోకి అనుమతించదని పేర్కొన్నారు. ఆటగాళ్లను ఓదార్చాలనుకుంటే మోదీ డ్రెస్సింగ్ రూమ్ బయట ప్రైవేట్ విజిటర్స్ ఏరియాలోనే ఆ పనిచేసి ఉండొచ్చని అన్నారు. ఈ విషయాన్ని తాను రాజకీయ నాయకుడిలా కాకుండా ఓ ఆటగాడిగా చెబుతున్నట్టు పేర్కొన్నారు. తాను టాయిలెట్‌లో ఉండగానో, బెడ్రూములో ఉన్నప్పుడో, డ్రెస్సింగ్ రూములో ఉన్నప్పుడో తన మద్దతుదారులను మోదీ అనుమతిస్తారా? అని ప్రశ్నించారు.


More Telugu News