పొన్నవోలు ఏదైనా ఉంటే కోర్టులో వాదించాలి... లేకపోతే వైసీపీలో చేరాలి: కనకమేడల

  • చంద్రబాబుకు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్
  • టీడీపీ, ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం
  • ఏఏజీ పొన్నవోలు న్యాయమూర్తికే దురుద్దేశాలు ఆపాదించారన్న కనకమేడల
  • జడ్జిలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం
చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. 

ఏఏజీ పొన్నవోలు ఏకంగా న్యాయమూర్తికే దురుద్దేశాలు ఆపాదించారని ఆరోపించారు. దీనిపై తాము కోర్టుకు వెళతామని, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్న ఏఏజీ కేసుకు సంబంధించి ఏదైనా ఉంటే కోర్టులో వాదించాలని, మీడియా ముందు కాదని హితవు పలికారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే ఆయన వైసీపీలో చేరడం మంచిదని కనకమేడల సలహా ఇచ్చారు.

"ప్రభుత్వ న్యాయవాది హోదాలో ఉన్నప్పుడు ఈ విధంగా మాట్లాడితే అది న్యాయవ్యవస్థను ధిక్కరించినట్టే అవుతుంది. జడ్జిలను పరోక్షంగా భయభ్రాంతులకు గురిచేయదలుచుకున్నారా?" అంటూ కనకమేడల వ్యాఖ్యానించారు. తీర్పు మీకు అనుకూలంగా వస్తే న్యాయం గెలిచినట్టా? తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే భయపెట్టే రీతిలో మీడియా సమావేశాలు పెడతారా? అంటూ మండిపడ్డారు.


More Telugu News