టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిపై మంత్రి రోజా పరువునష్టం కేసు

  • బండారు, భానుప్రకాశ్, టీవీ5 రాజేంద్రపై కోర్టులో కేసు పెట్టిన రోజా
  • తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వెల్లడి
  • క్రిమినల్ ఉద్దేశాలతో, పక్కా ప్రణాళికతో వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ మంత్రి రోజా నగరి కోర్టులో పరువునష్టం కేసు పెట్టారు. తన న్యాయవాదులతో కలిసి రోజా ఇవాళ కోర్టు వద్దకు వచ్చారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలను ఏమైనా అనొచ్చు అనుకునే మగవాడికి బుద్ధి చెప్పాలని... నాలాంటి ఒక మంత్రిని, ఒక ప్రముఖ నటిని, ఇక గృహిణిని ఎదుర్కోలేక పిచ్చి పిచ్చిగా వాగుతున్న బండారు గారు కానివ్వండి, భానుప్రకాశ్ కానివ్వండి, టీవీ5 రాజేంద్రను కానివ్వండి... వీళ్లను వదిలేది లేదు  అని ఏదైతే చెప్పానో, అదే విధంగా వారిపై నగరి కోర్టులో కేసు పెట్టానని వెల్లడించారు. 

"నేను, నా కుటుంబం సమాజంలో తిరగకూడదు, మేం ఆత్మహత్య చేసుకోవాలి, ఈ రాజకీయాల నుంచి మేం కనిపించకుండా పోవాలి అనే క్రిమినల్ ఉద్దేశాలతో, పక్కా ప్రణాళికతో ప్రెస్ మీట్లు పెట్టి నా వ్యక్తిత్వాని దిగజార్చే ప్రయత్నం చేశారు. నా గౌరవానికి భంగం కలిగేలా వారు మాట్లాడుతున్న మాటలు చాలా బాధాకరం. వీటిని ఎలాగైనా అరికట్టాలన్నదే నా ఆలోచన. నాలాంటి మహిళకే ఇలాంటిది జరిగితే, మామూలు మహిళ ఇంకెంత భయపడుతుంది? బయటికి రాగలుగుతుందా? నేను న్యాయాన్ని నమ్ముతాను కాబట్టి వాళ్లపై న్యాయపరమైన చర్యలు చేపట్టాను" అని రోజా వివరించారు.


More Telugu News