కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు... మీరు ఓటు పోటుతో పొడవండి: కేటీఆర్

  • విపక్షాలు కత్తిపోట్లతో రాజకీయాలు చేస్తున్నాయని మండిపడిన కేటీఆర్
  • కొత్త ప్రభాకర్ గెలుపు... రఘునందన్ రావు ఓటమి ఖరారైందన్న కేటీఆర్
  • అలిగినా.. గులిగినా మళ్లీ కారుకే ఓటు వేయాలని కేటీఆర్ విజ్ఞప్తి
విపక్షాలు కత్తిపోట్లతో రాజకీయాలు చేస్తున్నాయని, అలాంటి వారికి ఓటు పోటుతో సమాధానం చెప్పాలని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దుబ్బాకలో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... దుబ్బాకలో బీఆర్ఎస్‌కు ఓటు వేసి, కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎం చేద్దామన్నారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రఘునందన్ రావు ఓటమి ఖాయమైందన్నారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో వెయ్యి ఓట్లతో గెలిచిన వ్యక్తి మాటలకు ఆగం కావొద్దని రఘునందన్ రావును ఉద్దేశించి అన్నారు.

2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటల విద్యుత్ సరిపోతుందని చెబుతున్నాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డేమో రైతుబంధు వద్దు, ధరణి వద్దని అంటున్నారని, అలాంటి వారికి ఓట్లు వేద్దామా? అని ప్రశ్నించారు. క్రమంగా రైతుబంధును రూ.16వేలకు పెంచుతామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. విపక్షాల మాటలు నమ్మి వారికి ఓటేస్తే ఈ ఒక్కసారి చేసే తప్పుకు యాభై ఏళ్లు వెనక్కి పోతామని హెచ్చరించారు. 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడం సిగ్గుచేటని మండిపడ్డారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు.

కత్తిపోటుకు గురైన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవలే ప్రమాదం నుంచి బయటపడ్డాడని... కాబట్టి మీరంతా ఓటు పోట్లు పొడవాలని పిలుపునిచ్చారు. దుబ్బాకలో మరింత అభివృద్ధి జరగవలసి ఉందన్నారు. దుబ్బాకను అభివృద్ధి చేసే బాధ్యత మాది.. ఓట్లు వేయండి, పనులు చేసుకోవాలని సూచించారు. పింఛన్ రాలేదని, దళితబంధు రాలేదని... అలిగినా గులిగినా మళ్లీ బీఆర్ఎస్‌కే ఓటు వేయాలని కోరారు. నలుగురు ఉన్న కుటుంబంలోనే చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయని, కానీ నాలుగు కోట్ల ప్రజలు ఉన్న ఈ తెలంగాణలో కొన్ని అమలు చేయాలంటే సమయం పడుతుందన్నారు. ఢిల్లీ నుంచి పెద్దపెద్ద నేతలు వచ్చి ప్రయత్నం చేస్తున్నారన్నారు.


More Telugu News