ఏపీ ఫైబర్ నెట్ కేసు: నిందితుల ఆస్తులు అటాచ్ చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి
- ఏపీ ఫైబర్ నెట్ కేసులో నేడు కీలక పరిణామం
- ఏడుగురు నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కోరుతూ సీఐడీ పిటిషన్
- సానుకూలంగా స్పందించిన ఏసీబీ కోర్టు
ఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏడుగురు నిందితుల ఆస్తులు అటాచ్ చేసేందుకు ఏసీబీ కోర్టు సీఐడీకి అనుమతి ఇచ్చింది. మొత్తం రూ.114 కోట్ల ఆస్తుల అటాచ్ మెంట్ కు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. వేమూరి హరిప్రసాద్, టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, తుమ్మల ప్రమీల, ఇతర కుటుంబ సభ్యుల ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ తన పిటిషన్ లో పేర్కొంది. నిందితులకు చెందిన ఆస్తులు ఏడు ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించామని, వాటిని అటాచ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ తన పిటిషన్ లో వెల్లడించింది. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం అందుకు సమ్మతించింది.