భారత్ లోనూ టెస్లా కార్లు... త్వరలో ఒప్పందం!

  • ఎప్పట్నించో ఊరిస్తున్న టెస్లా విద్యుత్ కార్లు
  • జనవరి నాటికి ఒప్పందం ఖరారయ్యే అవకాశం
  • రెండేళ్ల లోపు ప్లాంట్ ఏర్పాటు
  • స్థానికంగా బ్యాటరీల తయారీతో ధరలు తగ్గే అవకాశం
ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఒప్పందం కుదరనుంది. భారత్, టెస్లా మధ్య ఒప్పందం జనవరి నాటికి ఖరారవుతుందని ఢిల్లీ వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబెర్గ్ మీడియా సంస్థ పేర్కొంది.

వచ్చే ఏడాది జనవరిలో జరిగే 'వైబ్రాంట్ గుజరాత్' గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం కుదిరితే రెండేళ్ల లోపు టెస్లా సంస్థ భారత్ లో ప్లాంట్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో టెస్లా ప్లాంట్ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ వాహన తయారీ రంగానికి అనువైన వాతావరణం నెలకొని ఉందని బ్లూంబెర్గ్ వివరించింది. 

తొలి దశలో టెస్లా భారత్ లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టే అవకాశముంది. సాధారణంగా టెస్లా కార్లు ఎంతో ఖరీదైనవి. భారత మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ధరలు తగ్గించాలంటే... బ్యాటరీలను స్థానికంగానే రూపొందించుకోవడం మేలని టెస్లా భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

విద్యుత్ కార్లకు బ్యాటరీలే గుండెకాయ వంటివి. బ్యాటరీలను దిగుమతి చేసుకోవడం అధిక వ్యయంతో కూడుకున్న పని. అందుకే భారత్ లోనే బ్యాటరీలు రూపొందించేలా టెస్లా ప్రణాళికలు రూపొందించుకుంటోందని సమాచారం.


More Telugu News