వరల్డ్ కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువకుడు

  • ఓటమి జీర్ణించుకోలేక బెంగాల్‌లో 23 ఏళ్ల యువకుడి ఆత్మహత్య
  •  ఇంట్లోనే ఉరివేసుకున్నాడంటున్న కుటుంబ సభ్యులు
  • మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రపంచ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి కప్ గెలవడం ఖాయమని భావించి భంగపాటుకు గురవ్వడంతో బాధపడుతున్నారు. టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేక పశ్చిమబెంగాల్‌లో 23 ఏళ్ల రాహుల్ లోహర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. క్రికెట్ అభిమాని అయిన సదరు లోహర్ భారత్ ఓటమిని తట్టుకోలేక ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బావ వెల్లడించాడు. బంకురా జిల్లాలోని తన ఇంటిలో ఉరి వేసుకున్నాడు. చీరల దుకాణంలో పనిచేస్తున్న లోహర్ ఫైనల్ మ్యాచ్ రోజు డ్యూటీ ఎగ్గొట్టాడని, ప్రొజెక్టర్‌పై మ్యాచ్‌ని వీక్షించాడని లోహర్ బావ ఉత్తమ్ సుర్ వివరించాడు. భారత్ మ్యాచ్ ఓడిపోయాక ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడని చెప్పాడు. 

లోహర్ టీమిండియాకి పెద్ద ఫ్యాన్ అని, తన కంటే జట్టునే ఎక్కువ అభిమానించేవాడని వివరించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఉత్తమ్ సుర్ వివరించాడు. ఆత్మహత్య చేసుకునే సమయంలో ఇంట్లో ఎవరూ లేరని, లోహర్ తమ్ముడు గుర్తించడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించినా ప్రాణాలు దక్కలేదని చెప్పాడు. ఈ కేసుపై పోలీసులు స్పందించలేదు. అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. క్రిమినల్ కోణంలో అనుమానం లేదని, అతడికేమైనా మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది.


More Telugu News