భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చిన వెన్ మామూలోడు కాదు!
- కోహ్లీ-రాహుల్ క్రీజులో ఉండగా సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి
- ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా వెన్‌కు ఇది మామూలే
- ఏదో ఒక సమస్యతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న వెన్
- రిమాండ్ విధించిన అహ్మదాబాద్ పోలీసులు
- వెన్ ఆస్ట్రేలియాకు చెందిన టిక్‌టాకర్
అహ్మదాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా ఓ యువకుడు మైదానంలోకి దూసుకొచ్చాడు. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. కోహ్లీ-కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పిన ఆ యువకుడు కోహ్లీని సమీపించాడు.
అతడిని ఆస్ట్రేలియాకు చెందిన వెన్ జాన్సన్‌గా గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని మైదానం బయటకు తరలించారు. జాన్సన్ ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా అతను ఇలానే చేస్తుంటాడు. ఆగస్టులో ఇంగ్లండ్-స్పెయిన్ మధ్య మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్‌లోనూ ఇలాగే మైదానంలోకి దూసుకెళ్లి మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. ఆ సమయంలో అతడు ‘ఫ్రీ ఉక్రెయిన్’, ‘పుట్లర్‌ను ఆపండి’ (పుతిన్ ప్లస్ హిట్లర్ పేరును కలిపి ఇలా పిలుస్తారు) అని రాసివున్న టీ షర్ట్‌ను ధరించాడు.
2020లో ఓ రగ్బీ మ్యాచ్‌కు కూడా అంతరాయం కలిగించాడు. దీంతో అతడికి 200 డాలర్ల జరిమానా విధించారు. ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు కూడా ఇలానే అంతరాయం కలిగించాడు. రెడ్ షార్ట్స్, వైట్ టీషర్ట్ ధరించిన జాన్సన్.. పాలస్తీనాపై యుద్ధాన్ని ఆపాలని, పాలస్తీనాను విడిచిపెట్టాలన్న మెసేజ్‌ను టీషర్ట్‌పై రాసుకున్నాడు. పాలస్తీనా జెండా రంగులు ఉన్న ఫేస్ మాస్క్ ధరించాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జాన్సన్ వెన్ ఓ ఆస్ట్రేలియన్ టిక్‌టాకర్.