భారత్‌కు వస్తున్న కార్గోషిప్‌ను హౌతీ రెబల్స్ ఎలా హైజాక్ చేశారో చూడండి.. వైరల్ వీడియో ఇదిగో!

  • తుర్కియే నుంచి భారత్ వస్తున్న కార్గోషిప్ ‘గెలాక్సీ లీడర్’
  • హెలికాప్టర్‌లో వెంబడించి నౌక డెక్‌పై దిగిన సాయుధులు
  • కెప్టెన్ గదిలోకి వెళ్లి నౌకను అదుపులోకి తీసుకున్న వైనం
  • నౌకలో తమవారెవరూ లేరన్న ఇజ్రాయెల్
  • నౌకను యెమెన్ తీరానికి తరలించిన హౌతీ రెబల్స్
తుర్కియే నుంచి భారత్ వస్తున్న ఇజ్రాయెల్ కార్గో షిప్‌ను ఎర్ర సముద్రంలో హైజాక్ చేసిన హౌతీ రెబల్స్ తాజాగా.. హైజాక్ వీడియోను విడుదల చేశారు.  వైరల్ అవుతున్న ఈ వీడియోలో షిప్‌ను ఎలా హైజాక్ చేసిందీ స్పష్టంగా ఉంది. హెలికాప్టర్‌పై నౌకను వెంబడించిన రెబల్స్ తొలుత నౌక డెక్‌పై ల్యాండయ్యారు. 

అనంతరం తుపాకులతో కిందికి దిగి పెద్దగా నినాదాలు చేస్తూ గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం కెప్టెన్ గదిలోకి వెళ్లి నౌకను తమ అదుపులోకి తీసుకున్నారు. తర్వాత దానిని యెమెన్ తీర ప్రాంతానికి తరలించారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో నౌకను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీ రెబల్స్ ఇప్పటికే ప్రకటించారు. 

అనుకున్నట్టే హైజాక్ చేసి తమ అదుపులోకి తీసుకున్నారు. నౌక హైజాక్ ఘటనపై ఇజ్రాయెల్ స్పందించింది. అందులో తమ దేశ పౌరులు ఎవరూ లేరని స్పష్టం చేసింది. హైజాక్‌కు గురైన ‘గెలాక్సీ లీడర్’ నౌక ఇజ్రాయెల్ వ్యాపారిదైనా ప్రస్తుతం మాత్రం దానిని జపాన్‌కు చెందిన ఓ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఉక్రెయిన్‌కు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు.


More Telugu News