ఏ ముఖం పెట్టుకొని బీజేపీ నేతలు గజ్వేల్‌కు వస్తున్నారు?: హరీశ్ రావు విమర్శలు

  • గజ్వేల్ తలరాతను మార్చింది కేసీఆరే... అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ గెలిపించాలన్న హరీశ్ రావు
  • బోర్లకు మీటర్లు పెట్టాలన్న బీజేపీ ఏ ముఖం పెట్టుకొని వస్తోందని ఆగ్రహం
  • బీజేపీ వాళ్లు ఓట్ల కోసం వస్తే అక్కాచెల్లెళ్లు చీపుర్లతో కొట్టి తరిమేయాలని పిలుపు
  • కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కష్టాలు తప్పవని హెచ్చరిక
ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినా గజ్వేల్ తలరాతను మార్చింది కేసీఆరేనని, ఈ నియోజకవర్గం అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ ఆయననే గెలిపించుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బోర్లకు మీటర్ పెట్టాలని చెప్పిన బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతోంది? అని ప్రశ్నించారు. రూ.400గా ఉన్న గ్యాస్ సిలిండర్‌ను రూ.1000కి పెంచారని, పాల మీద కూడా జీఎస్టీ వేశారని, అలాంటి పువ్వు గుర్తుకు ఓటు వేయాలా? అన్నారు. బీజేపీ వాళ్లు ఓట్ల కోసం వస్తే... గజ్వేల్ అక్కాచెల్లెళ్లు చీపుర్లతో కొట్టి తరిమేయాలని పిలుపునిచ్చారు. కనీసం అప్పుడైనా వాళ్లకు సిగ్గు వస్తుందన్నారు. 

ఈ పదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూడాలన్నారు. చుక్క నీరులేని గజ్వేల్‌ను గోదావరి గజ్వేల్‌గా మార్చారన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆరే మరోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తప్పుదారి వేరేపార్టీ వాళ్లు ఎమ్మెల్యే అయితే కనుక ఇక్కడ కేసీఆర్ వేసిన రోడ్లకు కూడా రిపేర్ చేయరని హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు తప్పవన్నారు. వంద అబద్ధాలు ఆడి గెలవాలని కాంగ్రెస్ వాళ్లు చూస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీలను నమ్మితే మోసపోతాం... తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కాగా, బీజేపీ నుంచి గజ్వేల్‌లో ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న విషయం విదితమే! 


More Telugu News