షమీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న ప్రధాని మోదీ

  • వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపాలైన టీమిండియా
  • టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో సీరియస్ వాతావరణం
  • ఆటగాళ్లను ఓదార్చిన ప్రధాని మోదీ
  • కృతజ్ఞతలు తెలిపిన షమీ
వరల్డ్ కప్ లో టీమిండియా ఆడిన మొదటి మ్యాచ్, చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాతోనే. ఆసీస్ పై గెలుపుతో వరల్డ్ కప్ ప్రస్థానం ప్రారంభించి, ఓటమితో ముగించింది. అయితే, ఓడిపోయింది ఫైనల్లో కావడంతో టీమిండియా ఆటగాళ్ల వేదన అంతా ఇంతా కాదు. 

అహ్మదాబాద్ లో నిన్న మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది. మెడల్ సెర్మనీలో ఆటగాళ్ల ముఖాలపై నవ్వు కనిపించినా, గుండెల్లో బాధ సుడులు తిరుగుతోంది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్ లోకి అడుగుపెట్టారు. ఆటగాళ్ల మనసులు తేలికపరిచేందుకు ప్రయత్నించారు.

ముఖ్యంగా, తీవ్ర విచారంలో ఉన్న పేసర్ మహ్మద్ షమీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. వీపుపై చేయి వేసి వాత్సల్యంతో నిమురుతూ షమీని ఊరడించారు. దీనికి సంబంధించిన ఫొటోను షమీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మోదీ... కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు.

"దురదృష్టవశాత్తు నిన్న మాకు కలిసి రాలేదు. ఈ టోర్నీ ఆసాంతం టీమిండియాకు, నాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మా డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి మాలో స్ఫూర్తిని ఇనుమడింపజేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మేం తప్పకుండా పుంజుకుంటాం" అని షమీ ట్వీట్ చేశాడు.


More Telugu News