'తిరువిన్ కురల్' మూవీ ఇంతవరకూ చూడలేదా?

  • తమిళంలో ఈ ఏడాదిలో విడుదలైన 'తిరువిన్ కురల్'
  • అదే టైటిల్ తో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు వెర్షన్ 
  • తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని హీరో అరుళ్ నిధి 
  • కంటెంట్ పరంగా ఉత్కంఠను రేకెత్తించే సినిమా ఇది 

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఇతర భాషలకి చెందిన చాలా సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా రోజులుగా అవి స్క్రీన్ పై కనిపిస్తున్నా కొన్ని సినిమాలను పట్టించుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. పెద్దగా తెలియని హీరోలు ఉన్నా .. టైటిల్ మన భాషలో లేకపోయినా ..  సినిమా మొదటి పావుగంట అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా .. వెంటనే వేరే సినిమాకి మారిపోవడం చేస్తూ ఉంటాము. అలాంటి సినిమాగా అనిపించి చూడటం మిస్సయితే .. తిరిగి చూడవలసిన సినిమా 'తిరువిన్ కురల్' అని చెప్పచ్చు.

ఇది తమిళ సినిమా .. హీరో అరుళ్ నిధి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు .. ఇక ఈ సినిమా తమిళ టైటిల్ తోనే 'నెట్ ఫ్లిక్స్'లో కనిపిస్తుంది. అయితే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. కంటెంట్ తెలియదు గనుక ఈ సినిమాపై చాలామంది దృష్టి పెట్టి ఉండరు. కాస్త ఓపిక పడితే ఈ సినిమా ఎంత ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళుతుందనేది తెలుస్తుంది. ఈ సినిమాలో .. హీరో 'తిరు' మాట్లాడలేడు .. తన తండ్రి గాయపడితే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుని వెళతాడు. 

ఆ హాస్పిటల్లోని లిఫ్ట్ మెన్ .. వార్డు బాయ్ .. సెక్యూరిటీ గార్డు .. శవాల గది దగ్గరుండే వ్యక్తి .. ఒక నర్సు వీళ్లంతా ఒక ముఠాగా ఏర్పడి వేరే బిజినెస్ చేస్తుంటారు. చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటారుగానీ, అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని ముఠా అది. ఆ ముఠాలోని ఒకడు 'తిరు' ఫ్యామిలీ లేడీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అతనిపై తిరు చేయి చేసుకోవడంతో, ఆ ముఠా పగబడుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది.

హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? చిన్న చిన్న గొడవలు ఎలా పెద్దవవుతాయి? సాధారణంగా కనిపించే వ్యక్తుల వెనుక ఎంత దుర్మార్గం దాగి ఉంటుంది? అనేది ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. హీరోయిజం .. విలనిజం ఈ రెండిటినీ దర్శకుడు ఆవిష్కరించిన తీరే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. ఇంతవరకూ ఈ సినిమాను చూడనివాళ్లు ఒక లుక్కు వేయవచ్చు.



More Telugu News