బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు

  • తొమ్మిదిన్నరేళ్ల పాలనలో హైదరాబాద్‌లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్న తలసాని
  • అసెంబ్లీ ఎన్నికలు వన్ సైడ్‌గా జరుగుతాయని ధీమా
  • బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆకాశం నుంచి చందమామను తెస్తామని చెబుతున్నాయని ఎద్దేవా
హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గరలోనే ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 25వ తేదీన పరేడ్ మైదానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన పరేడ్ మైదానాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్, సికింద్రాబాద్‌ను ప్రేమించే ప్రతిఒక్కరు కేసీఆర్ సభకు హాజరు కావాలని కోరారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో భాగ్యనగరంలో అనేక అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. సంక్షేమ రంగాల్లో అనేక మార్పులు తెచ్చినట్లు చెప్పారు.

ఈ అసెంబ్లీ ఎన్నికలు వన్ సైడ్‌గా జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ త్వరలో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఎన్నికల కోసమంటూ ఢిల్లీ నుంచి గద్దల్లా దిగుతున్నారని... ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోకు మంచి స్పందన లభిస్తోందన్నారు. ఆకాశం నుంచి చందమామను తెస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెబుతున్నాయని, అలాంటి పార్టీల మాటలు నమ్మవద్దని హితవు పలికారు. ఢిల్లీ నుంచి వచ్చే వారి మాటలు పక్కన పెట్టాలని కోరారు.


More Telugu News