రోహిత్ ఔట్‌పై స్పందించిన సునీల్ గవాస్కర్

  • మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఆ షాట్ ఆడకుండా ఉండాల్సిందని వ్యాఖ్య
  • అప్పటికే ఆ ఓవర్‌లో 10 పరుగులు రావడంతో ఆ షాట్ అవసరంలేదన్న సన్నీ
  • స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ దిగ్గజం
ఆస్ట్రేలియాపై వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో వేగంగా పరుగులు రాబట్టిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా కెప్టెన్ రోహిత్ శర్మ. పరుగులు రాబట్టేందుకు మిగతా బ్యాటర్లు ఆపసోపాలు పడిన పిచ్‌పై రోహిత్ అలవోకగా ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. కేవలం 31 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేసిన కెప్టెన్ స్పిన్సర్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి ఔటయ్యాడు. మొదటి పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ స్కోరు బోర్డు పటిష్ఠంగా కనిపించడానికి హిట్‌మ్యాన్ ఇన్నింగ్సే కారణం. అయితే తన వ్యక్తిగత స్కోరుని పెద్ద స్కోరుగా మలచకుండా రోహిత్ ఔటవ్వడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరంగా స్పందించాడు.

రోహిత్ శర్మ ఔట్ కావడమే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ కావచ్చని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఆ సమయంలో రోహిత్ చాలా అద్భుతంగా ఆడాడని, వేగంగా పరుగులు రాబట్టాడని అన్నాడు. ఔట్ అయిన ఓవర్‌లో ఒక సిక్స్, ఫోర్‌తో అప్పటికే 10 పరుగులు వచ్చిన తర్వాత ఆ షాట్‌ ఆడకుండా ఉండాల్సిందని గవాస్కర్ విశ్లేషించాడు. ఆ బంతి సిక్సర్‌ అయ్యుంటే అందరం లేచి చప్పట్లు కొట్టి అభినందించే వాళ్లమని, కానీ అంత కంగారుగా ఆ షాట్ ఆడాల్సిన అవసరమైతే లేదని అన్నాడు. మాక్స్‌వెల్స్, హెడ్స్, మార్ష్‌ బౌలింగ్ కోసం ఎదురుచూసి దాడి చేయాల్సిందని, కానీ అది జరగలేదని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.

కాగా వరల్డ్ కప్‌ 2023లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. 120కిపైగా స్ట్రైక్ రేట్‌తో మొత్తం 503 పరుగులు కొట్టాడు. సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 29 బంతుల్లోనే 47 పరుగులు కొట్టి ఔటయ్యాడు.


More Telugu News