భారత్ కు రావాల్సిన కార్గో షిప్‌ హైజాక్.. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దుశ్చర్య

  • నౌక హైజాక్ అయ్యిందని నిర్ధారించిన ఇజ్రాయెల్
  • ఇరాన్ మార్గదర్శకత్వంతో హైజాక్ జరిగిందని ఆరోపణ
  • నౌకలో 25 మంది సిబ్బంది.. భారతీయులులేరని వెల్లడి
  • అంతర్జాతీయంగా తీవ్ర పర్యవసనాలకు దారి తీసే అవకాశముందని ఆందోళన
తుర్కియే నుంచి భారత్‌కు రావాల్సిన కార్గో షిప్‌ ‘గెలాక్సీ లీడర్’ హైజాక్‌కు గురైంది. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ నౌకను హైజాక్ చేశారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ షిప్‌లో వేర్వేరు దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారని సమాచారం. తాము ఇజ్రాయెల్ నౌకను స్వాధీనం చేసుకున్నామని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. 

కార్గో షిప్ హైజాక్‌కు గురైన విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిర్ధారించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది. దక్షిణ ఎర్ర సముద్రంలో యెమెన్‌కు సమీపంలో హౌతీ తిరుగుబాటుదారులు కార్గో షిప్‌ను హైజాక్ చేశారని తెలిపింది. ప్రపంచ పర్యవసానాలకు దారితీసే తీవ్రమైన ఘటన ఇది అని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నౌక టర్కీలో బయలుదేరి భారత్ వెళ్తోందని, ఇందులో ఇజ్రాయెల్‌తోపాటు వివిధ దేశాల పౌరులు సిబ్బందిగా ఉన్నారని తెలిపింది. ఇది ఇజ్రాయెల్ నౌక కాదని వెల్లడించింది. 

మరోవైపు.. ఈ నౌకలో భారతీయులు ఎవరూలేరని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. అంతర్జాతీయ నౌకపై దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రకటించింది. బ్రిటీష్ కంపెనీకి చెందిన ఈ నౌకను జపాన్ సంస్థ నిర్వహిస్తోందని, ఇరాన్ మార్గదర్శకత్వంతో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారని ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది.

మరోవైపు ఇజ్రాయెల్‌కు చెందిన కార్గోషిప్‌ను యెమెన్ తీరానికి తీసుకెళ్లామని హౌతీ నేతల్లో ఒకరు పేర్కొన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పోర్ట్ నగరమైన సలీఫ్‌కు తీసుకెళ్లినట్లు పేర్కొంటున్నాయి. కాగా నౌక సిబ్బందిలో ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిప్పైన్స్, మెక్సికోతోపాటు వేర్వేరు దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు. కాగా నౌక ఇజ్రాయెల్‌కు చెందింది కాకపోయినప్పటికీ ఇజ్రాయెలీ వ్యాపారవేత్త అబ్రహం ఉంగార్‌కు పాక్షిక యజమానిగా ఉన్నారని ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ రిపోర్ట్ పేర్కొంది.


More Telugu News