రోహిత్ సేనకు రాహుల్ ద్రావిడ్ మద్దతు..మరో సూర్యోదయం ఉంటుందని వ్యాఖ్య

  • వరల్డ్ కప్ చేజార్చుకున్న టీమిండియా బ్యాటర్లలో కానరాని దూకుడు 
  • 11-40 ఓవర్ల మధ్య కేవలం రెండే బౌండరీలు
  • రోహిత్ సేన రక్షణాత్మక ధోరణితో ఆడలేదన్న రాహుల్ ద్రావిడ్
  • ఇన్నింగ్స్ పునర్నిర్మించుకునేందుకు ప్రయత్నించామని స్పష్టీకరణ
ఆస్ట్రేలియా చేతిలో వరల్డ్ కప్ ఫైనల్స్‌లో టీమిండియా ఘోర పరాజయం అభిమానులను తీవ్ర నిరాశలో ముంచేసింది. అయితే, వరుసగా విజయాలతో ఇంతకాలం తమను ఉర్రూతలూగించిన రోహిత్ సేనకు భారతీయులు అండగా నిలుస్తూ, ఓదారుస్తున్నారు. తాజాగా టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘మేము ధైర్యంగా ఆట కొనసాగించాము. మొదటి పవర్ ప్లేలో ఏకంగా 80 పరుగులు వచ్చాయి. కొన్నిసార్లు వికెట్లు కోల్పోయాక ఇన్నింగ్స్ పునర్నిర్మించుకోవాల్సి ఉంటుంది. మేము రక్షణాత్మక ధోరణితో ఆడలేదు. రోహిత్ శర్మ ఓ అసాధారణ లీడర్. టీం విజయాలకు తన శక్తియుక్తులన్నీ కేటాయిస్తాడు. అయితే, టోర్నీ మొదలైననాటి నుంచి టీమిండియా, అభిమానులకు ఎన్నో మర్చిపోలేని క్షణాలను అందించింది. రోహిత్ సేన విచారంలో కూరుకుపోయింది. డ్రెసింగ్ రూంలో వారి స్థితి చూడటం ఓ కోచ్‌గా నాకు ఎంతో కష్టంగా అనిపించింది. కానీ మరో సూర్యోదయం వస్తుంది. క్రీడాకారులుగా మేము జయాపజయాలకు అతీతంగా ముందడుగు వేస్తాం’’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. 

వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలవడంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. రోహిత్ తొలి పది ఓవర్లలో దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పదో ఓవర్ ముగిసేసరికి భారత్ 80 పరుగులు చేసింది. ఆ తరువాత రోహిత్ పెవిలియన్ బాటపట్టాక భారత్ దూకుడుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఆ తరువాత 20 ఓవర్లలో టీమిండియా కేవలం రెండు బౌండరీలే సాధించింది. దీంతో, స్వల్ప స్కోరుతోనే భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


More Telugu News