మెడికల్ రిపోర్ట్ ను టీడీపీ ఆఫీసులో తయారు చేశారు: సీదిరి అప్పలరాజు
- బెయిల్ పొడిగించుకోవడానికి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్న అప్పలరాజు
- గుండె జబ్బులు ఉన్న వ్యక్తులకు కంటి ఆపరేషన్ చేయరని వ్యాఖ్య
- యాంజియోగ్రామ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదని విమర్శ
బెయిల్ ను పొడిగించుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ను ఒక డాక్టర్ గా తాను పరిశీలించానని చెప్పారు. చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రి మెడికల్ రిపోర్టులో పేర్కొందని... ఈ రిపోర్ట్ ప్రకారం గుండె జబ్బులు ఉన్న వ్యక్తులకు ఏ డాక్టర్ కూడా కంటి ఆపరేషన్ చేయరని అన్నారు. సీటీ కాల్షియం స్కోర్ 1611కి పెరిగి ప్రమాదమని రిపోర్ట్ లో ఉన్నప్పుడు కంటి ఆపరేషన్ చేయరని చెప్పారు. గుండెకు బైపాస్ సర్జరీ చేసిన తర్వాతే కంటి ఆపరేషన్ చేస్తారని అన్నారు. యాంజియోగ్రామ్ రిపోర్ట్ ను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. మందుల ప్రిస్క్రిప్షన్ ను రిపోర్ట్ లో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. బెయిల్ పొడిగించుకోవడానికి టీడీపీ ఆఫీస్ లో మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకు అందించారని ఆరోపించారు.