కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్లకుండా ఉంటారా?: భైంసాలో బండి సంజయ్ ప్రశ్న

  • కాంగ్రెస్ ఆరు హామీలు ఇచ్చింది.. అధికారంలోకి వస్తే ఆరుగురు ముఖ్యమంత్రులు ఉంటారన్న సంజయ్
  • ఈ పని చేశానని చెప్పేందుకు కేసీఆర్ వద్ద ఏమీ లేదు... అందుకే బీజేపీపై విమర్శలు అన్న కరీంనగర్ ఎంపీ
  • రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోయిందని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇచ్చిందని, అలాగే వారు అధికారంలోకి వస్తే ఆరుగురు ముఖ్యమంత్రులు ఉంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.  శనివారం ఆయన భైంసాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ పనులు సరిగ్గా చేశామని కేసీఆర్ చెప్పగలరా? అని నిలదీశారు. ఇవి చేశామని చెప్పడానికి కేసీఆర్ వద్ద ఏమీ లేదన్నారు. అందుకే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. బీజేపీకి ప్రజలనుంచి వస్తోన్న ఆదరణ చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.

కేసీఆర్, ఆయన కుటుంబం వల్లే తెలంగాణ రాలేదని, ప్రజలందరి పోరాటం వల్లే వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఆరు హామీలు ఇచ్చిందని, కానీ కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీలనే నెరవేర్చలేకపోతోందన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్లకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసినా వృథా అన్నారు.


More Telugu News