ఏపీలో మందుబాబులకు షాక్.. మళ్లీ పెరిగిన మద్యం ధరలు

  • మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు
  • క్వార్టర్ పై రూ. 10, ఫుల్ బాటిల్ పై రూ. 20 పెంపు
  • కొన్ని రకాల బ్రాండ్ల ధరల్లో తగ్గుదల
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. క్వార్టర్ పై రూ. 10, ఫుల్ బాటిల్ పై రూ. 20 పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో రూపాయల్లో విధించే అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను శాతాల్లోకి మారుస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఈ విధానంతో కొన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలో తగ్గుదల కనిపించింది. 

ఫారిన్ లిక్కర్ పై ధరలు సవరించలేదని ఎక్సైజ్ శాఖ తెలిపింది. పెరుగుతున్న రవాణా, ఇతర ఖర్చుల నేపథ్యంలో ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. సరఫరాదారులకు ఇచ్చే ధరను 20 శాతం పెంచుతున్నట్టు తెలిపింది. ఐఎంఎఫ్ఎల్ కనీస ధర రూ. 2,500 లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ. 2,500 దాటితే దానిపై 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్ పై 200 శాతం, ఫారిన్ లిక్కర్ పై 75 శాతం ఏఆర్ఈటీ ఉంటుందని వెల్లడించింది. 



More Telugu News