టెక్ ప్రపంచంలో సంచలనం.. సీఈవో ఆల్ట్‌మన్‌‌ను తొలగించిన చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ

  • ఆల్ట్‌మన్‌పై బోల్డన్నిఆరోపణలు చేసిన ఓపెన్ ఏఐ
  • విశ్వాసం కోల్పోయాడని, బోర్డు నిర్ణయాలకు అడ్డుపడుతున్నాడని ఆరోపణ
  • నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టీకరణ
టెక్ రంగంలో మరో కుదుపు. ‘విశ్వాసం కోల్పోయాడంటూ’ సీఈవో శామ్ ఆల్ట‌మన్‌ను చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ తొలగించింది. 38 ఏళ్ల ఆల్ట్‌మన్ చాట్‌జీపీటీ విడుదలతో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. మానవ మేధను మరో మెట్టు ఎక్కించిన ఆయన తొలగింపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఆల్ట్‌మన్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని, స్థిరంగా, నిష్కపటంగా ఉండడం లేదని పేర్కొంది. బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో అతడు నిజాయతీగా ఉండడం లేదని, సరైన సమాచారం పంచుకోవడం లేదని పేర్కొన్న ఓపెన్ ఏఐ.. బోర్డు నిర్ణయాలకు కూడా ఆల్ట్‌మన్ అడ్డుపడుతున్నారని, ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు నమ్మకం లేదని తీవ్ర ఆరోపణలు చేసింది. చర్చాత్మక సమీక్ష ప్రక్రియ అనంతరం ఆయనను తొలగించినట్టు తెలిపింది. అంతేకాదు, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది.  

మిస్సౌరీలో జన్మించిన స్టాన్‌ఫోర్డ్ డ్రాపౌట్ అయిన ఆల్ట్‌మన్ గతేడాది విడుదల చేసిన చాట్‌జీపీటీ అతడికి విపరీతమైన స్టార్‌డమ్ తీసుకొచ్చింది. ఓపెన్ ఏఐలో టెక్‌ దిగ్గజం ఓపెన్ ఏఐ బిలియన్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. ఇప్పుడీ సాంకేతికతను మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చింజిన్‌లో ఉపయోగిస్తోంది.  

ఓపెన్ ఏఐ తనను తొలగించడంపై ఆల్ట్‌మన్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఓపెన్ ఏఐలో పనిచేయడాన్ని తాను ఎంతో ఇష్టపడ్డానని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనను మార్చేసిందని, ప్రపంచాన్ని కూడా కొద్దిగా మార్చిందని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఇష్టపడ్డానని తెలిపారు. 8 ఏళ్ల క్రితం తన అపార్ట్‌మెంట్‌లో తామందరం కలిసి నిర్మించిన దాని గురించి తాను చాలా గర్వపడుతున్నట్టు చెప్పారు.


More Telugu News