ఫైనల్లో ఆ ఆటగాడే ‘గేమ్ ఛేంజర్’ అంటున్న గౌతమ్ గంభీర్!

  • శ్రేయాస్ అయ్యర్ కీలకంగా మారబోతున్నాడని అంచనా వేసిన గంభీర్
  • సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై అద్భుతంగా సెంచరీ కొట్టాడని ప్రశంసల జల్లు
  • గాయం నుంచి కోలుకున్నాక జట్టులో చోటు కోసం పోరాడాడని ప్రస్తావన
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ కప్ 2023 ఫైనల్‌పై ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ మ్యాచ్‌పై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఉత్కంఠ పోరుపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ ఆసక్తికరంగా స్పందించాడు. మోతెరా స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ అత్యంత కీలకంగా మారబోతున్నాడని జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్లు ఆడమ్ జంపా, మ్యాక్స్‌వెల్ బౌలింగ్ వేసేటప్పుడు అయ్యర్ కీలకపాత్ర పోషించనున్నాడని అంచనా వేశాడు. న్యూజిలాండ్‌పై ఒత్తిడితో కూడిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 70 బంతుల్లోనే సెంచరీ కొట్టాడని ప్రశంసల జల్లు కురిపించాడు. అందుకే ఫైనల్ మ్యాచ్‌లో అయ్యర్ అతిపెద్ద గేమ్ ఛేంజర్‌ అవుతాడని అన్నాడు. గంభీర్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ఈ విధంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. 

గాయం నుంచి కోలుకున్న తర్వాత అయ్యర్ జట్టులో స్థానం కోసం పోరాడాల్సి వచ్చిందని గంభీర్ అన్నాడు. జట్టులోకి వచ్చాక అద్భుతంగా రాణిస్తున్నాడని, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌‌గా చక్కగా ఆడుతున్నాడని కొనియాడాడు. ఇదిలావుండగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఒకే ఎడిషన్‌లో 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా అయ్యర్ రికార్డు సృష్టించాడు. బుధవారం న్యూజిలాండ్‌పై సాధించిన అద్భుత సెంచరీతో ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా ఈ వరల్డ్ కప్‌లో అయ్యర్ 75.14 సగటుతో 526 పరుగులు కొట్టాడు. స్ట్రైక్ రేటు 113 కంటే ఎక్కువగా ఉంది. టోర్నీలో ఇప్పటివరకు 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు బాదాడు. టోర్నీలో బెస్ట్ స్కోరు 128 నాటౌట్‌గా ఉంది. ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు.


More Telugu News