ఫైనల్ ముంగిట... ఎవరూ ఊహించని వ్యక్తి నుంచి టీమిండియాకు శుభాకాంక్షలు

  • వరల్డ్ కప్ ఫైనల్ చేరిన టీమిండియా
  • ఈ నెల 19న ఫైనల్లో ఆసీస్ తో పోరు
  • టీమిండియా కప్ గెలవాలని కోరుకుంటున్నట్టు తెలిపిన లెజెండరీ బాక్సర్
  • టీమిండియా అత్యుత్తమ టీమ్ అని పేర్కొన్న ఫ్లాయిడ్ మేవెదర్ 
వరల్డ్ కప్ ఫైనల్ ముంగిట టీమిండియాకు అనుకోని వ్యక్తి నుంచి శుభాకాంక్షలు అందాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు... లెజెండరీ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్. అమెరికాలో ఓ బాస్కెట్ బాల్ మ్యాచ్ కు హాజరైన మేవెదర్... మ్యాచ్ విరామంలో టీమిండియాకు విషెస్ తెలిపాడు. భారత జట్టు వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించాడు. భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమం అని మేవెదర్ కొనియాడాడు. 

46 ఏళ్ల మేవెదర్ అమెరికా జాతీయుడు. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో ఫ్లాయిడ్ మేవెదర్ తిరుగులేని యోధుడిగా కీర్తి పొందాడు. మైక్ టైసన్ వంటి మహాబలుడు కూడా బాక్సింగ్ లో కొన్ని ఓటములను ఎదుర్కొన్నాడు. కానీ ఫ్లాయిడ్ మేవెదర్ ఒక్క ఓటమి కూడా లేకుండా కెరీర్ ను ముగించడం విశేషం. 

ప్రొఫెషనల్ బాక్సర్ గా మారాక ఇప్పటివరకు 50 బౌట్లలో పాల్గొన్న మేవెదర్ అన్నీ గెలిచాడు. అందులో 27 విజయాలు ప్రత్యర్థులను నాకౌట్ చేయడం ద్వారా సాధించాడు. 

సూపర్ ఫెదర్ వెయిట్, లైట్ వెయిట్, లైట్ వెల్టర్ వెయిట్, వెల్టర్ వెయిట్, లైట్ మిడిల్ వెయిట్ విభాగాల్లో 15 టైటిళ్లు నెగ్గడం మేవెదర్ కే చెల్లింది. 1996లో ప్రొఫెషనల్ బాక్సర్ గా కెరీర్ ఆరంభించిన మేవెదర్ 2017లో చివరి బౌట్ లో పాల్గొన్నాడు. మేవెదర్ 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో కాంస్యం నెగ్గాడు.


More Telugu News