భారత్‌తో ఫైనల్ కోసం వేచి ఉండలేకపోతున్నాం: ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్

  • ఫైనల్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నామని వెల్లడి
  • అహ్మదాబాద్‌లో పెద్ద సంఖ్యలో భారత్ అభిమానుల మధ్య ఫైనల్ ఆడాల్సి ఉంటుందని వ్యాఖ్య
  • సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై గెలుపు అనంతరం ఆసీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రికెట్ ప్రపంచ కప్‌లలో సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరుస్తున్న ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్ చేరుకుంది. కోల్‌కతా వేదికగా ఉత్కంఠభరిత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్‌తో ఫైనల్ ఆడేందుకు సిద్దమైంది. సౌతాఫ్రికాపై గెలుపు అనంతరం ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్‌లో భారత్‌తో తలపడేందుకు వేచి ఉండలేకపోతున్నామని పాట్ కమ్మిన్స్ అన్నాడు. ఆతిథ్య టీమిండియాకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులతో అహ్మదాబాద్ స్టేడియం నిండిపోతుందని, భారత్‌కు ఏకపక్ష మద్దతు ఉంటుందని తెలుసని, ఈ పరిస్థితిని స్వీకరించి మ్యాచ్ ఆడాల్సి ఉంటుందని కమ్మిన్స్ అన్నాడు. 

ఆసీస్ ఆటగాళ్లలోని పలువురికి ఇప్పటికే ఫైనల్స్ ఆడిన అనుభవం ఉండడం టీమ్‌కు కలిసొచ్చే విషయమని, 2015 వరల్డ్ కప్ తన కెరీర్ బెస్ట్ అని, ఈ కారణంగానే భారత్‌లో జరిగే ఈ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం తాను వేచివుండలేనని కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఇదిలావుండగా అహ్మదాబాద్‌ స్టేడియం 1.3 లక్షల మంది సామర్థ్యాన్ని కలిగివున్న విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికాపై గెలుపుపై స్పందిస్తూ.. సునాయాసంగా గెలుస్తామని భావించామని, కానీ కాస్త ఇబ్బంది పడి గెలవాల్సి వచ్చిందని పాట్ కమ్మిన్స్ అన్నాడు. రెండు గంటలపాటు నరాలు తెగే ఉత్కంఠను అనుభవించాల్సి వచ్చిందని తెలిపాడు. ఆసీస్ ఆటగాళ్లతోపాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా చాలా బాగా ఆడారని అన్నాడు.


More Telugu News