కేసీఆర్ రెండుచోట్ల పోటీపై... తనకు ముఖ్యమంత్రి పదవిపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

  • గజ్వేల్ కంటే కామారెడ్డిలో వెయ్యి ఓట్లు ఎక్కువగా ఇస్తే ఇక్కడే ఉంచే హామీ తనదే అన్న కవిత
  • రెండు స్థానాల్లో పోటీ తమ స్ట్రాటెజీ అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • సీఎం కావాలనే కోరిక ఉందా? అని ప్రశ్నించగా... తనకు తొందర ఏముందన్న కవిత
ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు టీవీ 9 ఛానల్ మెగా పొలిటికల్ షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నప్పటికీ.. మరి రేపు ఈ రెండింట్లో గెలిస్తే ఏ స్థానంలో ఉంటారో చెప్పాలి కదా? అని ప్రశ్నించగా కవిత సమాధానం ఇచ్చారు. కేసీఆర్ రెండు స్థానాలలో పోటీ చేసే పరిస్థితి ఏమీ రాలేదని, అది తమ స్ట్రాటెజీ మాత్రమే అన్నారు. అలాగే కేసీఆర్ స్ట్రాటెజీని ఎదుర్కొన్న వ్యక్తిని తాను అయితే చూడలేదన్నారు.

కవిత కోసం ఆ నియోజక వర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు? అనే ప్రచారం సాగుతోందని ప్రశ్నించగా.. కవిత మాట్లాడుతూ... తాను అంత బలహీనంగా లేనని, తన కోసం తండ్రి సీటు గెలిచి ఇవ్వాల్సిన దయనీయమైన స్థితిలో తాను లేనన్నారు. కామారెడ్డి ప్రజలకు తాను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని, గజ్వేల్ నియోజకవర్గం కంటే కామారెడ్డిలో 1000 ఓట్ల మెజార్టీని అధికంగా ఇస్తే కేసీఆర్‌ను అక్కడే ఉంచే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.

ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా? అని ప్రశ్నించగా... తనకు తొందర ఏముందని, తాను చాలా జూనియర్ లీడర్‌ను అని, తనకు ఇంకా చాలా లైఫ్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ... కేసీఆర్ తయారు చేసిన స్ట్రక్చర్‌లో వచ్చి కూర్చుందామని, వంట అంతా అయిపోయాక గరిటె తిప్పుదామనే ఆలోచన మాత్రమే ఆ పార్టీకి ఉందని, వాళ్లు కొత్తగా ఏం చేస్తామని చెబుతున్నారు? అని ప్రశ్నించారు. ఎంతసేపూ వాళ్లు మాట్లాడేది బీఆర్ఎస్ పెన్షన్ అంత ఇస్తుంది మేం ఇంత ఇస్తాం... రైతుబంధు అంత ఇస్తున్నారు.. మేం ఇంత ఇస్తామని మాత్రమే చెబుతున్నారన్నారు. మా పథకాలు కాపీ కొట్టాక ఇక మీరు ఎందుకు? అని, అది మేమే ఇస్తాం కదా అన్నారు. తాను ప్రజల మధ్యనే ఉండాలనే ఆలోచన తనకు ఉందన్నారు. మూడోసారి ఎన్నికలను తాము టఫ్‌గా ఏమీ ఫీల్ కావడం లేదని, ఇక్కడ టీవీ స్టూడియోలో కూర్చొని చూస్తే అర్థం కాదని, ప్రజల్లో తిరగాలన్నారు.


More Telugu News