దొమ్మేరులో ఉద్రిక్తత... హోంమంత్రి తానేటి వనితను అడ్డుకున్న స్థానికులు

  • దొమ్మేరులో మహేంద్ర అనే యువకుడు ఆత్మహత్య
  • మహేంద్ర ఎస్సీ వర్గానికి చెందిన యువకుడు
  • మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన తానేటి వనిత, మేరుగ నాగార్జున
  • మంత్రులకు స్థానికుల నుంచి తీవ్ర నిరసన
హోంమంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గగం కొవ్వూరు పరిధిలోని దొమ్మేరులో బొంతా మహేంద్ర అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహేంద్ర ఎస్సీ వర్గానికి చెందిన యువకుడు. కాగా, మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించేందుకు తానేటి వనిత, మంత్రి మేరుగ నాగార్జున నేడు దొమ్మేరు వచ్చారు. అయితే వారికి స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. 

పోలీసుల చర్య వల్లే మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. మంత్రి ఎందుకు వచ్చారంటూ వారు నిలదీశారు. మృతుడి బంధువులు, స్నేహితులు మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. 

నవంబరు 6న దొమ్మేరులో 'గడపగడపకు...' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాడు హోంమంత్రి తానేటి వనిత కూడా వచ్చారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక వైసీపీ నేతలు సతీశ్, నాగరాజుల ముఖాలు ఉన్న భాగాన్ని ఎవరో చించేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. 

ఈ వివాదంలో పోలీసులు ఎస్సీ యువకుడు మహేంద్రను స్టేషన్ కు తీసుకెళ్లారు. సాయంత్రం వరకు అతడిని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. బయటికి వచ్చిన అనంతరం అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా, స్థానికులు పోలీసులపై దాడికి దిగారు. ఈ దాడిలో అదనపు ఎస్పీకి గాయాలయ్యాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ మహేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి.


More Telugu News