ఐటీ సోదాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్పందన

  • తనకు ఎలాంటి కంపెనీలు లేవని వెల్లడించిన బీఆర్ఎస్ లీడర్
  • రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయని వెల్లడి
  • కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫైర్
తెలంగాణలోని పలుచోట్ల గురువారం ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ దాడులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్పందించారు. తన ఇంటిపై, తన సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులంటూ జరుగుతున్న ప్రచారం అంతా బూటకమని కొట్టిపడేశారు. జిల్లాలోని పలు చోట్ల ఉన్న రైస్ మిల్లులపై రెయిడ్స్ జరుగుతున్నాయని, ఆ రైస్ మిల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున మళ్లీ బరిలో నిలిచిన నల్లమోతు భాస్కర్.. వేములపల్లిలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తేలడంతో తట్టుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికలలో తమను ఓడించే సామర్థ్యంలేక కుట్ర పన్ని ఇలా తప్పుడు వార్తలను ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తెస్తున్నాయని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తనకు ఎలాంటి కంపెనీలు లేవని, పెద్ద మొత్తంలో డబ్బు లేదని నల్లమోతు స్పష్టం చేశారు. ఉన్నట్లు నిరూపిస్తే వారికే ఇచ్చేస్తానని నల్లమోతు భాస్కర్ సవాల్ విసిరారు.


More Telugu News