వాళ్లంతా మూర్ఖులు.. కివీస్‌‌పై ఇండియా గెలుపు తర్వాత సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • పిచ్ మార్చారంటూ వాగిన మూర్ఖులందరూ నోళ్లు మూయాలంటూ స్ట్రాంగ్ కౌంటర్
  • ఒకవేళ పిచ్ మార్చినా టాస్‌కు ముందే.. మ్యాచ్ మధ్యలో మార్చలేదు కదా అని సమాధానం
  • ఎలాంటి పిచ్ అయినా సామర్థ్యమున్న జట్టు గెలుస్తుందని వ్యాఖ్య
  • టీమిండియా అదే చేసిందని ప్రశంసించిన సునీల్ గవాస్కర్
న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ముంబై వాంఖడే పిచ్‌ను భారత్ తమ స్పిన్నర్లకు అనుకూలించేలా మార్చినట్లు అనేక రిపోర్టులు వెలువడ్డాయి. గెలుపు కోసం పిచ్‌నే మార్చేశారంటూ ఒక్కసారిగా వివాదం చెలరేగింది. అయితే మ్యాచ్ తర్వాత ఇదంతా అసత్య ప్రచారమేనని తేలిపోయింది. దీంతో విమర్శలకు దిగిన అందరికీ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

పిచ్ మార్చారంటూ వాగిన మూర్ఖులందరూ నోళ్లు మూయాలంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. భారత క్రికెట్‌పై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించాడు. దృష్టిని ఆకర్షించడానికో, మరే దానికోసమో చాలామంది చాలా చెబుతారని, అవన్నీ అర్ధంలేనివని గవాస్కర్ పేర్కొన్నాడు. ఒకవేళ పిచ్ మార్చినప్పటికీ టాస్‌కు ముందే రెండు జట్లకు అందుబాటులో ఉందని అన్నారు. ఇన్నింగ్స్ మధ్యలో మార్చలేదని, టాస్ వేసిన తర్వాత మార్చలేదని పేర్కొన్నాడు. సామర్థ్యమున్న జట్టు అయితే ఆ పిచ్‌పై ఆడి గెలుస్తారని, టీమిండియా ఆ పని చేసిందని కొనియాడాడు. కాబట్టి పిచ్‌ల గురించి మాట్లాడడం మానేయాలని సూచించాడు. ఇక రెండో సెమీఫైనల్ కూడా జరగక ముందే అహ్మదాబాద్ పిచ్ మార్చడం గురించి మాట్లాడుతున్నారని, ఇదంతా బుద్ధిలేని పని అని మండిపడ్డారు. ఈ మేరకు ‘స్టార్ స్పోర్ట్స్’తో సునీల్ గవాస్కర్ మాట్లాడాడు.

కాగా.. ముంబై వాంఖడే పిచ్ మార్చారనే రిపోర్టులపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విధంగా సుదీర్ఘకాలంపాటు టోర్నీ జరిగే సమయంలో పిచ్‌లను మార్చడం సర్వసాధారణమని, ఇప్పటికే రెండు సార్లు ఈ విధంగా జరిగిందని ఐసీసీ వెల్లడించింది. క్యూరేటర్ సిఫార్సు మేరకు ఈ మార్పు జరిగిందని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. ఐసీసీ పిచ్ కన్సల్టెంట్ అట్కిన్సన్‌కు కూడా ఈ మార్పు గురించి తెలుసునని వివరించింది.


More Telugu News