7 వికెట్లతో చెలరేగి జహీర్ ఖాన్‌ రికార్డును చెరిపేసిన మహ్మద్ షమీ.. సుదీర్ఘ ప్రపంచ కప్ రికార్డు బ్రేక్

  • 23 వికెట్లతో ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరణ
  • 2011 ఎడిషన్‌లో 21 వికెట్లు తీసిన జహీర్ ఖాన్‌ను వెనక్కి నెట్టేసిన షమీ
  • కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు తీసి మెప్పించిన షమీ
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన వరల్డ్ కప్ 2023 తొలి సెమీఫైనల్లో ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను ఓడించిన టీమిండియా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బౌలింగ్ విషయానికి వస్తే సహచర బౌలర్లు వికెట్లు తీయలేకపోయిన చోట స్టార్ పేసర్ మహ్మద్ షమీ అద్భుతం చేశాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్ ఓటమికి బాటలు వేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును కూడా దక్కించుకున్నాడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ షమీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హీరోగా మారిపోయాడు.

న్యూజిలాండ్‌పై అద్భుత ప్రదర్శనతో 7 వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీ పలు రికార్డులను నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచ కప్‌లో కేవలం 6 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక వన్డే ప్రపంచకప్‌లో 50 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ అవతరించాడు. అంతేకాదు ఇండియా తరపున ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన దిగ్గజ జహీర్ ఖాన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 2011 వరల్డ్ కప్ ఎడిషన్‌లో జహీర్ ఖాన్ 21 వికెట్లు తీశాడు. సుదీర్ఘకాలం తర్వాత జహీర్‌ రికార్డును షమీ అధిగమించాడు.

ఒకే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీళ్లే..
1. మహ్మద్ షమీ - 23 వికెట్లు (2023 ఎడిషన్ - 6 మ్యాచ్‌లు)
2. జహీర్ ఖాన్ - 21 వికెట్లు (2011 ఎడిషన్ - 11 మ్యాచ్‌లు)
3. ఉమేష్ యాదవ్ - 18 వికెట్లు (2015 ఎడిషన్-8 మ్యాచ్‌లు)
4. జస్ప్రీత్ బుమ్రా - 18 వికెట్లు (2019 ఎడిషన్ - 9 మ్యాచ్‌లు)
5. జస్ప్రీత్ బుమ్రా - 18 వికెట్లు (2023 ఎడిషన్ - 10 మ్యాచ్‌లు).

ఇక ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధికంగా 27 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ రికార్డుకు షమీ ఇంకా 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. 2019 ఎడిషన్ వరల్డ్ కప్‌లో స్టార్క్ ఈ రికార్డును నెలకొల్పాడు. ఆస్ట్రేలియాకే చెందిన గ్లెన్ మెక్‌గ్రాత్ 26 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా ఇదే..
1. మిచెల్ స్టార్క్ -27 వికెట్లు (2019 ఎడిషన్-10 మ్యాచ్‌లు)
2. గ్లేన్ మెక్‌గ్రాత్ - 26 వికెట్లు (2007 ఎడిషన్ - 11 మ్యాచ్‌లు)
3. మహ్మద్ షమీ - 23 వికెట్లు (2023 ఎడిషన్-6 మ్యాచ్‌లు)
4. చమిందా వాస్ - 23 వికెట్లు (2003 ఎడిషన్ - 10 మ్యాచ్‌లు)
5. ముత్తయ్య మురళీధరన్ - 23 వికెట్లు (2007 ఎడిషన్ - 10 మ్యాచ్‌లు)


More Telugu News