న్యూజిలాండ్ ఓటమి.. వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్!

  • 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్
  • మిచెల్ సెంచరీ వృథా
  • ఏడు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించిన షమీ 
  • చివరి ఓవర్లల్లో వరస వికెట్లతో ఖాయమైన న్యూజిలాండ్ ఓటమి 
భారత్ తన అప్రతిహత విజయయాత్ర కొనసాగిస్తూ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ప్రపంచకప్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ టోర్నీలో వరసుగా పదో విజయాన్ని నమోదు చేసింది. 398 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ కీలక దశల్లో వికెట్లు తీసిన షమీ న్యూజిలాండ్‌ పరాజయానికి బాటలు పరిచాడు. ఇప్పటివరకూ మ్యాచ్‌కు సగటున నాలుగు, ఐదు వికెట్లు తీస్తున్న షమీ ఈ మ్యాచ్‌లో ఏకంగా ఏడు వికెట్లు తీసి తనకు తిరుగేలేదని నిరూపించుకున్నాడు. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. కోహ్లీ(117), శ్రేయస్(105) సెంచరీలు భారత్‌‌కు కీలకంగా మారాయి. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ కూడా రాణించారు.  విరాట్ 50 సెంచరీల రికార్డు భారత ఇన్నింగ్స్‌కు హైలైట్‌గా నిలిచింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఓపెనర్లు ఇద్దరు స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో న్యూజిలాండ్ ఓటమికి పునాది పడింది. అయితే, డారిల్ మిచెల్ ఓ సెంచరీతో న్యూజిలాండ్‌ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. కానీ, న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో సరైన భాగస్వామ్యం లేకపోవడంతో అతడి ప్రయత్నం వృథా అయ్యింది.


More Telugu News