నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ... పటేల్ రమేశ్ రెడ్డికి కాంగ్రెస్ ముఖ్య నేతల బుజ్జగింపులు

  • సూర్యాపేట నుంచి టిక్కెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేశ్ రెడ్డి
  • ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
  • బుజ్జగించేందుకు రమేశ్ రెడ్డి ఇంటికి మల్లు రవి, రోహిత్ చౌదరి
కాంగ్రెస్ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పటేల్ రమేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ బీ-ఫామ్ ఇచ్చింది. దీంతో పటేల్ రమేశ్ రెడ్డి ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రమేశ్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. సూర్యాపేటలోని ఆయన నివాసానికి ఏఐసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, రోహిత్ చౌదరి తదితరులు వెళ్లారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అందుకు ససేమీరా అంటున్నారట.

పటేల్ రమేశ్ రెడ్డిని బుజ్జగించేందుకు వచ్చిన నేతలను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ఆయనకు అన్యాయం చేశారని, నామినేషన్ ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాల్సింది రమేశ్ రెడ్డి కాదని.... రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని అన్నారు. చర్చలు జరుపుతుండగా వారు కూర్చున్న గదివైపు రాళ్లు విసిరారు. మల్లు రవి, రోహిత్ చౌదరిలు బయటకు వెళ్లకుండా గదికి తాళం వేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది.


More Telugu News