భారీ వేతన ప్యాకేజీతో గూగుల్ ఏఐ ఉద్యోగులకు గాలం వేస్తున్న చాట్‌జీపీటీ!

  • తొలి నుంచీ గూగుల్‌కు గట్టిపోటీ ఇస్తున్న చాట్‌జీపీటీ
  • షేర్ల అమ్మకం ద్వారా 86 బిలియన్ డాలర్లకు కంపెనీ విలువ
  • కొత్త ఉద్యోగులకు 5 నుంచి 10 మిలియన్ డాలర్లు ఇస్తామన్న ఓపెన్ ఏఐ
  • గూగుల్, ఓపెన్ ఏఐ మధ్య నైపుణ్య వనరుల కోసం పోటీ!
చాట్‌జీపీటీగా అందరికీ తెలిసిన ఓపెన్ ఏఐ మొదటి నుంచి గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆ సంస్థ ఉద్యోగులకే ఎర వేసి లాక్కుంటోంది. వివిధ కేటగిరీల్లో రీసెర్చర్ల కోసం పెద్దమొత్తంలో ఆఫర్ చేస్తోంది. షేర్లు అమ్మబోతున్నట్టు ఇటీవల హింట్ ఇచ్చిన చాట్‌జీపీటీ తద్వారా కంపెనీ విలువ 86 బిలియన్ డాలర్లకు చేరుకోబోతోందని పేర్కొంది. అదే జరిగితే 5 నుంచి 10 మిలియన్ డాలర్లతో కొత్త ఉద్యోగులను తీసుకుంటామని తెలిపింది. 

‘టెక్‌క్రంచ్’ ప్రకారం.. గూగుల్, మెటా నుంచి నిపుణులను తెచ్చుకోవడంలో ఓపెన్ఏఐ విజయం సాధించింది. చాట్‌జీపీటీ లాంచింగ్ సమయంలో తమ వద్ద ఐదుగురు గూగుల్ మాజీ రీసెర్చర్లు ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కంపెనీలో 93 మంది ఉన్నారు. వీరిలో గూగుల్‌కు చెందిన 59 మంది, మెటాకు చెందిన 34 మంది ఉన్నారు.

తమ సూపర్ అలైన్‌మెంట్ టీంను మరింత బలోపేతం చేసుకునేందుకు ఓ రీసెర్చ్ ఇంజినీర్‌ను ఓపెన్ ఏఐ తీసుకుంది. ఈ రోల్ కోసం 2.45 లక్షల డాలర్ల నుంచి 4.50 లక్షల డాలర్ల వరకు వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, తమ లాభాల్లో ‘ఉదారమైన వాటా’తోపాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపింది.  

నైపుణ్య పోటీపై ఓపెన్ ఏఐ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, ఇది ప్రతిభ కోసం ఓపెన్ ఏఐ, గూగుల్ మధ్య జరుగుతున్న యుద్ధంగా భావించవచ్చు. కృత్రిమ మేధలో పురోగతి సాధించేందుకు రెండు కంపెనీలు అత్యుత్తమమైన వారి కోసం పోటీపడుతున్నాయి. ప్రతివారం తమ ఏఐ చాట్‌బాట్‌ను 100 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నట్టు ఓపెన్ ఏఐ తెలిపింది.


More Telugu News