బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్

  • మంగళవారం అర్ధరాత్రి కడప సెంట్రల్‌ జైలుకు తరలింపు
  • 10 నెలలక్రితం కడప విమానాశ్రయంలో తోపులాట ఘటనపై కేసు
  • మీడియాకు వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ షరీఫ్
పది నెలల క్రితం కడప విమానాశ్రయం వద్ద పోలీసులతో వాగ్వాదం, ఆందోళన చేపట్టిన కేసులో మంగళవారం రాత్రి అరెస్టయిన టీడీపీ నేత మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి‌కి (బీటెక్‌ రవి) కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వ్యక్తిగత పనిమీద మంగళవారం సాయంత్రం పులివెందుల నుంచి కడప వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించిన అనంతరం కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీంతో బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. 

ఇదిలావుండగా బీటెక్‌ రవి అరెస్టుపై కడప డీఎస్పీ షరీఫ్‌ వివరాలు వెల్లడించారు. విమానాశ్రయం వద్ద జరిగిన తోపులాటలో తమ ఏఎస్‌ఐకి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేశామని, బీటెక్‌ రవి అందుబాటులో లేకపోవడంతో మంగళవారం అరెస్టు చేసినట్టు వివరించారు.

  కేసు పూర్వాపరాలు..
పులివెందులలో ‘యువగళం పాదయాత్ర’ ప్రారంభానికి 2 రోజుల ముందు జనవరి 25న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఆహ్వానం పలికేందుకు బీటెక్ రవి కడప విమానాశ్రయానికి వెళ్లారు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, రవి అనుచరులు తరలి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి వీల్లేదని చెప్పిన పోలీసులతో బీటెక్ రవి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట, ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.


More Telugu News