వన్డే బౌలింగ్ ర్యాంక్స్‌లో కీలక మార్పు.. అగ్రస్థానాన్ని కోల్పోయిన సిరాజ్‌.. ఇప్పుడు నెం 1 ఎవరంటే..!

  • నంబర్ 1 వన్డే బౌలర్‌గా అవతరించిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్
  • రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్
  • వరుసగా 4, 5వ స్థానాల్లో బుమ్రా, కుల్దీప్ యాదవ్
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వన్డేల్లో నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి దిగజారాడు. ఈ మేరకు పురుషుల వన్డే బౌలర్ల ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. చాలా వారాల తర్వాత సిరాజ్ ఈ ర్యాంకును కోల్పోయాడు. మహరాజ్ నంబర్ 1 ర్యాంకును సాధించడానికి పలు అంశాలు దోహదపడ్డాయి. గత బుధవారం నుంచి 3 మ్యాచ్‌లు ఆడిన మహరాజ్ 7 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌పై 4/46, భారత్‌పై 1 వికెట్, ఆఫ్ఘనిస్తాన్‌పై 2/25 ప్రదర్శన చేశాడు. దీంతో మహరాజ్ రేటింగ్ పాయింట్లు పెరిగాయి. ప్రస్తుతం సిరాజ్ కంటే కేవలం 3 పాయింట్లు మాత్రమే ముందున్నాడు. మహరాజ్ ఖాతాలో 726, సిరాజ్‌కు 723 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి.

భారత్ గతవారంలో ఒకే ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడింది. దీంతో సిరాజ్ పెద్దగా రాణించేందుకు అవకాశం లేదు. మరోవైపు టీమిండియా మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తమ ర్యాంక్స్‌ను మెరుగుపరుచుకున్నారు. 687 రేటింగ్ పాయింట్లతో బుమ్రా 4వ స్థానంలో, 682 రేటింగ్ పాయింట్లతో కుల్దీప్ 5వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 2వ ర్యాంకులో నిలిచాడు. విరాట్ కోహ్లీ (4), రోహిత్ శర్మ (5) టాప్-10లో చోటు దక్కించుకున్నారు.


More Telugu News