జగనన్న విద్యాకానుక కిట్స్ లో అవినీతి జరిగింది: నాదెండ్ల మనోహర్

  • ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తున్నామన్న నాదెండ్ల
  • టోఫెల్, పాల వెల్లువ పథకాల్లో అవినీతిని బయటపెట్టామని వెల్లడి
  • ప్రస్తుతం విద్యాశాఖలో జరిగిన అవినీతిని బయటికి తెస్తున్నామని వివరణ 
రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తున్నామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మేం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయం అని స్పష్టం చేశారు. టోఫెల్, పాల వెల్లువ పథకాలలో అవినీతిని బయటపెట్టామని వెల్లడించారు. ఇప్పుడు... విద్యాశాఖలో జరిగిన అవినీతిని బయటకు తెస్తున్నామని నాదెండ్ల వివరించారు. 

జగనన్న విద్యా కానుక పేరుతో ప్రవేశపెట్టిన కిట్స్ లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో 5 కంపెనీలపై ఈడీ దాడులు చేసిందని, ఆ ఐదు కంపెనీలే విద్యా కానుక కిట్లు సరఫరా చేస్తున్నాయని నాదెండ్ల అన్నారు. ఆ ఐదు సంస్థలు ఒక సిండికేట్ గా ఏర్పడి పిల్లలకు నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్నాయని తెలిపారు. 

ఇప్పటివరకు రూ.2,400 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. టెండర్లు ఆ ఐదు కంపెనీలకే ఎందుకు ఇచ్చారని నాదెండ్ల ప్రశ్నించారు. గ్లోబల్ విద్యార్థులను తయారు చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్ల డబ్బును దారి మళ్లించారని ఆరోపించారు. 

నాడు-నేడుకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను ఖర్చు చేయలేదని, వంటశాలలు, ప్రహరీ గోడలు నిర్మించకుండా దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల మళ్లింపుపై కేంద్రం వెంటనే స్పందించాలని నాదెండ్ల స్పష్టం చేశారు. అవినీతిపై విచారణ చేసి సీఎం జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


More Telugu News