ఈ ఏడాది రికార్డు సంఖ్యలో అమెరికా ఫ్లైటెక్కిన భారతీయ విద్యార్థులు

  • 2022-23లో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన పది లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు
  • ఎప్పట్లానే టాప్ లో చైనా విద్యార్థులు
  • ఈసారి వెళ్లిన ప్రతీ నలుగురిలో ఒకరు భారతీయ విద్యార్థే.. 
  • ఓపెన్ డోర్స్ తాజా రిపోర్టులో వెల్లడి
ఉన్నత విద్య కోసం అమెరికా ఫ్లైటెక్కుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది రికార్డు సంఖ్యకు చేరింది. 2022-23 విద్యా సంవత్సరంలో ఏకంగా 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో అడుగుపెట్టారు. ఈ ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 10,57,188 కాగా అందులో 2,89,526 మంది విద్యార్థులతో చైనా టాప్ లో ఉండగా ఎప్పట్లానే భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరంలో అమెరికాలో అడుగుపెట్టిన ప్రతీ నలుగురు విదేశీ విద్యార్థులలో ఒకరు మన భారతీయులే ఉండడం విశేషం. ఈమేరకు ‘ది ఓపెన్ డోర్స్ 2023 రిపోర్ట్’ ఈ వివరాలను వెల్లడించింది.

గతేడాదితో పోలిస్తే చైనా విద్యార్థుల సంఖ్య కాస్త (-0.2 శాతం) తగ్గగా.. భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమం తప్పకుండా పెరుగుతోంది. అగ్రరాజ్యం వెళుతున్న విద్యార్థుల్లో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ల సంఖ్యే ఎక్కువగా ఉందని ఓపెన్ డోర్స్ రిపోర్టు వెల్లడించింది. ఫాల్ స్నాప్ షాట్ సర్వే 2023 ప్రకారం.. అమెరికా విద్యాసంస్థలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు 70 శాతం, గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు 80 శాతం ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ ఏడాది నిర్వహించిన స్టూడెంట్ ఎన్ రోల్ మెంట్ పోగ్రాంలో 630 అమెరికన్ విద్యా సంస్థలు పాల్గొన్నాయి.

అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ కామర్స్ గణాంకాల ప్రకారం.. అగ్రరాజ్యంలోని ఉన్నత విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులలో 6 శాతం మంది విదేశీ విద్యార్థులే. వీరి ద్వారా అమెరికాకు దాదాపుగా 38 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. కొవిడ్ పాండెమిక్ తర్వాత విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుందని అమెరికాలోని 48 రాష్ట్రాల విద్యాసంస్థలు వెల్లడించాయి. ఇక, చదువు పూర్తయ్యాక చేసే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా ఏటా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా వెళుతున్న విదేశీ విద్యార్థులలో చైనా టాప్ లో ఉండగా ఆ తర్వాతి స్థానంలో ఇండియా నిలిచింది. బంగ్లాదేశ్, కొలంబియా, ఘనా, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్, స్పెయిన్ తదితర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు.


More Telugu News