క్రికెట్‌లో మరో అద్భుతం.. ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా క్రికెటర్

  • చివరి ఓవర్‌లో ఐదు పరుగులు అవసరమైన వేళ బౌలర్ మ్యాజిక్
  • ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి ప్రత్యర్థికి షాకిచ్చిన గారెత్ మోర్గాన్
  • ఆస్ట్రేలియాలోని జిల్లా క్రికెట్  క్లబ్‌లో ఘటన
క్రికెట్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇప్పటి వరకు ఓవర్‌లో ఆరు బంతులను సిక్సర్లుగా మలిచిన ఘటనలు మాత్రమే చూశాం. ఇప్పుడు ఏకంగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఒకరు సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాలోని జిల్లా క్రికెట్ క్లబ్‌లో జరిగిందీ ఘటన. చివరి ఓవర్‌లో ప్రత్యర్థి జట్టు విజయానికి ఐదు పరుగులు అవసరమైన వేళ ఈ ఇన్‌క్రెడిబుల్ ఫీట్ సాధించాడా బౌలర్. 

గోల్డ్‌కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ 3లో మడ్గీరాబా నెరాంగ్ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్న గారెత్ మోర్గాన్ అ ఘనత సాధించాడు. 40 ఓవర్ల మ్యాచ్‌లో సర్ఫెర్స్ పారాడైజ్ జట్టు 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. 39 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 5 పరుగులు మాత్రమే అవసరమైన వేళ మోర్గాన్ కోలుకోలేని దెబ్బ తీశాడు.


చివరి ఓవర్‌ను తొలుత యువ బౌలర్‌కు ఇవ్వాలని భావించానని కానీ, ఆ ఓటమి ఏదో తన చేయి మీదుగా జరిగిపోతే బాగుంటుందని, అనవసరంగా ఆ బౌలర్‌కు ఎందుకు దానిని ఆపాదించాలని భావించి తానే బంతిని అందుకున్నట్టు మోర్గాన్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత వరుసగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టినట్టు చెబుతూ ఆనందపరవశుడయ్యాడు. అతడు తీసిన ఆరు వికెట్లలో తొలి నాలుగు క్యాచ్‌లు కాగా, చివరి ఇద్దరు బౌల్డయ్యారు. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసిన తొలి బౌలర్‌ను తానేనని చెబుతూ సంతోషంలో మునిగిపోయాడు. 


గతంలో ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఐదు వికెట్లు తీసిన సందర్భాలున్నాయి. భారత్‌కు చెందిన మిథున్ 2019లో, న్యూజిలాండ్‌కు చెందిన వాగ్నర్ 2011లో, బంగ్లాదేశ్‌ ఆటగాడు అమీన్ 2013తో ఐదేసి వికెట్లు తీసుకున్నారు. ఇప్పుడు మోర్గాన్ ఆరు వికెట్లు పడగొట్టి వారి రికార్డును బద్దలుగొట్టాడు.


More Telugu News