విడిపోయిన రేమండ్స్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా-నవాజ్ దంపతులు

  • 32 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు
  • వదంతులు తమ జీవితాన్ని చుట్టుముట్టాయన్న సింఘానియా
  • ఇటీవల దురదృష్టకర పరిణామాలు చోటుచేసుకున్నాయంటూ భావోద్వేగ ప్రకటన
దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రేమండ్స్‌ ఛైర్మన్‌, ఎండీ గౌతమ్‌ సింఘానియా వైవాహిక బంధానికి ముగింపు పలికారు. తన భార్య నవాజ్‌ నుంచి విడిపోయినట్లు సోమవారం ప్రకటించారు. ఇటీవల కొన్ని దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకున్నాయని, నిరాధార ప్రచారాన్ని ఎక్కువ మంది వ్యాపింపజేశారని, బహుశా వాళ్లు తమ శ్రేయోభిలాషులు కారేమోనని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు.

‘‘ఈ దీపావళి గతంలో మాదిరిగా జరగడం లేదు. 32 ఏళ్లపాటు దంపతులుగా, తల్లిదండ్రులుగా, ఎల్లప్పుడూ ఒకరికి మరొకరం చోదకశక్తిగా ఉన్నాం. విశ్వాసం, నిబద్ధతతో ప్రయాణించాం. అయితే గత కొంతకాలంగా దురదృష్టకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాకు అంతగా శ్రేయోభిలాషులు కాని వ్యక్తులు వ్యాపింప జేసిన వదంతులు మా జీవితాన్ని చుట్టుముట్టాయి. ఇక నుంచి నేను, నవాజ్ వేర్వేరు బాటల్లో జీవితాలను కొనసాగించగలమని విశ్వాసం ఉంది. ఆమె నుంచి నేను విడిపోతున్నాను. అయితే మా ఇద్దరి పిల్లలు నిహారిక, నీసాలకు అత్యుత్తమైన జీవితాన్ని అందించే ప్రయత్నాలను ఉమ్మడిగానే కొనసాగిస్తాం. మా వ్యక్తిగత నిర్ణయాన్ని అందరూ గౌరవించండి’’ అని ‘ఎక్స్’ పోస్టులో గౌతమ్ సింఘానియా రాసుకొచ్చారు. 

గత వారం ముంబైలోని థానేలో సింఘానియా నిర్వహించిన దీపావళి ముందస్తు వేడుకలకు ఆహ్వానం ఉన్నా నవాజ్‌ను అనుమతించలేదని ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కొన్ని రోజుల్లోనే సింఘానియా నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. కాగా సుమారు రూ.11,000 కోట్ల నికర ఆస్తిపరుడైన గౌతమ్ సింఘానియా, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నవాజ్‌తో 32 ఏళ్లక్రితం 1999లో పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


More Telugu News