అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి

  • ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే బాలరాజుపై మట్టిపెళ్లతో దాడి
  • మతిస్థిమితంలేని వ్యక్తి దాడి చేసినట్టుగా గుర్తింపు
  • అమ్రాబాద్ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘటన
అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై మూడు రోజుల వ్యవధిలో మరోసారి దాడి జరిగింది. నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లిలో సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనపై మతిస్థిమితంలేని వ్యక్తి మట్టిపెళ్ల విసిరాడు. అయితే బాలరాజు అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు. దాడికి పాల్పడిన తిరుపతయ్య అనే వ్యక్తిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ వీరబాబు వెల్లడించారు. నిందితుడు తిరుపతయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్థులపై ఇలాగే దాడులు చేస్తుంటాడని, అతడి మానసికస్థితి సరిగా లేదని వివరించారు. తిరుపతయ్యకి మతిస్థిమితంలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారని ఆయన వెల్లడించారు.

కాగా ఈ ఘటనపై ఫేస్‌బుక్ వేదికగా బాలరాజు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ గూండాలు రాళ్ల దాడి చేయడంతో చేతికి దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు సిగ్గుండాలని, కాంగ్రెస్ నాయకుల వైఖరి చూసి ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతుందని అన్నారు. ఖబర్దార్ వంశీకృష్ణ, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ గూండాలలారా అని హెచ్చరించారు. దాడికి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశారు.

ఇదిలావుండగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై శనివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఆయన గాయపడ్డారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. తిరిగి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు.


More Telugu News