పాక్ మాజీ ఆటగాడు హసన్ రజాపై మండిపడిన రవిశాస్త్రి

  • వరల్డ్ కప్ లో విశేషంగా రాణిస్తున్న టీమిండియా బౌలర్లు
  • టీమిండియా బౌలర్లకు ఇస్తున్న బంతులు తేడా ఉన్నాయన్న రజా
  • డీఆర్ఎస్ ఫలితాలను బీసీసీఐ మార్చేస్తోందని ఆరోపణ
  • ఇవన్నీ కుంటిసాకులేనన్న రవిశాస్త్రి
  • రజా... జడేజా, కుల్దీప్ ల పైనా ఆరోపణలు చేసేట్టున్నాడని వ్యంగ్యం
వరల్డ్ కప్ లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండగా, ఇతర జట్లు వాడుతున్న బంతుల కంటే, టీమిండియా బౌలర్లు వినియోగిస్తున్న బంతులు తేడాగా ఉన్నాయని పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా ఇటీవల ఆరోపణలు చేయడం తెలిసిందే. 

అంతేకాదు, మ్యాచ్ లలో డీఆర్ఎస్ అప్పీళ్లను బీసీసీఐ తారుమారు చేస్తోందని, టీమిండియాకు అనుకూలంగా ఫలితాలు వచ్చేలా మార్చేస్తోందని కూడా హసన్ రజా ఆరోపించాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఎల్బీడబ్ల్యూ వివాదం నేపథ్యంలో రజా ఈ తాజా వ్యాఖ్యలు చేశాడు. 

దీనిపై భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి తీవ్రంగా స్పందించారు. రజా అందరిపైనా ఆరోపణలు చేశాడని... ఇక రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లపై ఆరోపణలు చేయడమే మిగిలుందని ఎద్దేవా చేశారు. 

ఈసారి... జడేజా, కుల్దీప్ టెక్నాలజీ సాయంతోనే వికెట్లు పడగొడుతున్నారని ఆరోపణలు చేస్తాడని వ్యంగ్యం ప్రదర్శించారు. టీమిండియా స్పిన్నర్లు బంతిని ఒకవైపుకు తిప్పితే టెక్నాలజీ వల్ల ఆ బంతి మరోవైపుకు స్పిన్ అవుతుందని చెబుతాడని వివరించారు. ఇవన్నీ కుంటిసాకులు తప్ప ఇంకేమీ కాదని, ఇదంతా చెత్త వాగుడు అని రజా వ్యాఖ్యలను కొట్టిపారేశారు.


More Telugu News