మంద కృష్ణ మాదిగ మోదీకి అమ్ముడు పోయారు... నా పార్టీలో చేరమంటే రూ.25 కోట్లు అడిగారు: కేఏ పాల్

  • మంద కృష్ణ మాదిగ మోదీకి అమ్ముడుపోయారని ఆరోపణలు
  • విశ్వరూప సభకు రూ.72 కోట్లు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్న
  • మోదీ అసలు బీసీయే కాదన్న కేఏ పాల్
  • నా పార్టీలో చేరమంటే మంద కృష్ణ రూ.25 కోట్లు అడిగారన్న ప్రజా శాంతి పార్టీ అధినేత
కుటుంబ పాలన, కుల పాలన వద్దని, ఇప్పుడు ఉన్న మూడు పార్టీలను పక్కన పెట్టేద్దామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... నిన్న మంద కృష్ణ మాదిగ ప్రధాని నరేంద్ర మోదీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. నిన్నటి విశ్వరూప సభకు రూ.72 కోట్లు ఎవరిచ్చారు? బీజేపీయే ఇచ్చిందని ఆరోపించారు. ఈ సభలో మంద కృష్ణ మాదిగ మోదీని బాగా పొగిడారని, ఆయన దేవుడితో సమానమని చెప్పారని, అన్నా.. పెద్దన్న అంటూ బాగా నటించారన్నారు. కానీ నరేంద్ర మోదీ అంతకంటే పెద్ద నటుడు అన్నారు. వర్గీకరణ చేస్తానని ప్రధాని మోదీ చెప్పారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అన్నారు.

ట్రంప్ చిన్న తప్పు చేసినందుకు అమెరికాలో ఆయనను అరెస్ట్ చేశారన్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి లక్షల కోట్లు దోచుకుంటున్నారని, ప్రధాని వ్యాపారులకు రుణమాఫీ చేస్తున్నారని, కానీ పేదలకు రూ.25 వేలు ఎందుకు రుణమాఫీ చేయడం లేదు? అని ప్రశ్నించారు. అంతకుముందు బీసీ సమావేశానికి వచ్చి బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారని, తాను బీసీ అని చెప్పారని, కానీ ఆయన బీసీయే కాదన్నారు. ఆయన తన శిష్యుడు కాబట్టి నేను చెబుతున్నానని, నేను కూడా మోసపోయానన్నారు. ఆయన సర్టిఫికెట్లు డూప్లికేట్‌వే అన్నారు. తనను జైల్లో పెట్టమంటే పెట్టడం లేదని, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మీడియా వస్తుందని అరెస్ట్ చేయడం లేదన్నారు.

వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ చాలా కష్టపడ్డారని, పోరాటం చేశారన్నారు. కానీ అమ్ముడు పోయారన్నారు. ప్రజా శాంతి పార్టీలో చేరమంటే రూ.25 కోట్లు అడిగారని, మరి ఈ రోజు బీజేపీకి ఓటు వేయమని చెబుతున్నారని, ఆయనకు రూ.250 కోట్లు ముట్టాయా? రూ.2500 కోట్లు ముట్టాయా? అని నిలదీశారు. లేక రాజ్యసభ అవకాశం ఇచ్చి, కేంద్రమంత్రిగా చేస్తానని చెప్పారా? అని ప్రశ్నించారు. మన మాల, మాదిగల మధ్య విభేదాలు వద్దన్నారు. ఆ మూడు పార్టీలకు ఓటు వేస్తే మీకు నష్టమన్నారు. మీరు ఓటు వేయాలనుకుంటే నోటాకు వేయాలని సూచించారు.


More Telugu News