శ్మశానంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్

  • దళిత కుటుంబాలు ఆనవాయతీగా నిర్వహిస్తున్న వేడుకలో పాల్గొన్న బండి సంజయ్
  • దీపావళి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంజయ్
  • ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డ యువతీయువకులు
దీపావళి పర్వదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సందడిగా జరిగాయి. ముఖ్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో పలుచోట్ల రాజకీయ నాయకులు ప్రత్యేక అతిథులుగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్థానిక వ్యవసాయ మార్కెట్ సమీపంలోని శ్మశానంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తమ పెద్దలు, పూర్వీకులను గుర్తుచేసుకుంటూ స్థానిక దళిత కుటుంబాలు ప్రతి ఏడాది ఈ విధంగా శ్మశానంలో దీపావళి వేడుకలను నిర్వహిస్తుంటారు. సమాధులపై దీపాలు వెలిగించి వారి ఆత్మలు శాంతించాలని కోరుకుంటుంటారు. ఎప్పటిమాదిరిగానే ఈ ఏడాది నిర్వహించిన వేడుకల్లో బండి సంజయ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


బండి సంజయ్‌తో ఫొటోలు దిగేందుకు అక్కడ ఉన్నవారు ఆసక్తిచూపించారు. సెల్ఫీలు తీసుకునేందుకు చాలామంది ఎగబడ్డారు. కాగా అక్కడ ఉన్నవారందరికీ బండి సంజయ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుండగా శ్మశానంలో దీపావళి వేడుకల కోసం మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లైటింగ్స్, త్రాగునీటి సౌకర్యాలను సిద్ధం చేశారు. కాగా బండి సంజయ్ తెలంగాణ అసెంబ్లీ బరిలో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మంత్రి, బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్‌తో ప్రధానంగా ఆయన తలపడబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గంలో ఉద్ధృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.


More Telugu News