మా వ్యూహం అదే..సెమీస్‌లో కాలుపెట్టాక రోహిత్ శర్మ కీలక వ్యాఖ్య

  • వరుస విజయాలతో వరల్డ్ కప్ సెమీస్‌లో కాలు పెట్టిన భారత్
  • అవసరానికి తగ్గట్టు టీం సభ్యులు తమని తాము మలుచుకున్నారన్న రోహిత్ శర్మ
  • ఒక్కో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లామని వ్యాఖ్య
నిన్న నెదర్లాండ్స్‌పై గెలుపుతో వరుస విజయాల పరంపరను కొనసాగిస్తూ టీమిండియా వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో కాలుపెట్టింది. లీగ్ దశలో ఓటమనేదే లేకుండా నాకౌట్‌కు చేరింది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాలు, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ అర్థశతకాలతో నిన్న మ్యాచ్‌లో భారత్‌ సునాయసంగా విజయతీరాలకు చేరింది. కానీ, లీగ్ దశలో టీం ఆటతీరుపై కెప్టెన్ రోహిత్ శర్మ మురిసిపోయాడు. క్రీడాకారులు ఆద్భుతంగా రాణించారంటూ పోగడ్తల్లో ముంచెత్తాడు. 

‘‘టోర్నమెంట్ మొదలైన నాటి నుంచీ ఒక్కో గేమ్ ఆడుకుంటూ వెళ్లాం. ఇది సుదీర్ఘ టోర్నమెంట్ కాబట్టి, మొత్తం టోర్నమెంట్ గురించి ఒకేసారి ఆలోచించకుండా ఆడే మ్యాచ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టాం. విజయం కోసం పోరాడాం. టీం సభ్యులు ప్రతిఒక్కరూ ఇదే చేశారు. పలు మైదానాల్లో, వివిధ ప్రత్యర్థులతో మ్యాచ్‌లు ఉన్నప్పుడు సందర్భానికి తగ్గట్టు మనల్ని మనం మలుచుకోవాల్సి ఉంటుంది. మేం సరిగ్గా ఇదే చేశాం.

‘‘ఇలా ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ గెలవడం ఎంతో సంతోషాన్నిస్తోంది. న్యూజిలాండ్‌ మ్యాచ్‌లోనూ మేం చక్కని ప్రదర్శన ఇచ్చాం. ఇది టీంకు శుభసూచకం. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నెరవేరుస్తూ టీం కోసం శ్రమించారు. తొలి నాలుగు మ్యాచులను ఛేదనతో ప్రారంభించాక, తరువాతి మ్యాచుల్లో బ్యాటర్లు అద్భుత స్కోరు చేసి ఆపై బాధ్యతను సీమర్లు, స్పిన్నర్లకు అందించారు. ఇక డ్రెస్సింగ్ రూం వాతావరణంలో ఉత్సాహం తొణికిసలాడాలంటే మైదానంలో మంచి ఫలితాలు రాబట్టాలి. మా నుంచి అభిమానులు అత్యద్భుత ప్రదర్శన ఆశిస్తున్నా, ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆటపైనే దృష్టి పెట్టాలనుకున్నాం.. అదే చేశాం’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.


More Telugu News