ఆగ్రాలో అరాచకం.. పట్టపగలే యువతిపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం!

  • గతంలోనే వీడియో చిత్రీకరించిన యువకులు
  • దానిని అడ్డంపెట్టుకుని బ్లాక్‌మెయిల్
  • బాధితురాలితో మద్యం తాగించి, తలపై గాజు సీసా పగలగొట్టి పైశాచికత్వం
  • నిందితులతోపాటు వారికి సహకరించిన మహిళ అరెస్ట్
  • నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఐదుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

పోలీసుల కథనం ప్రకారం.. 25 ఏళ్ల బాధితురాలి వీడియోను గతంలోనే చిత్రీకరించారు. దానిని చూపించి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. బాధిత యువతితో మద్యం తాగించిన నిందితులు ఆ తర్వాత ఆమె తలపై గాజు సీసాను పగలగొట్టారు. సాయం కోసం వేడుకుంటూ రోదిస్తున్న బాధితురాలి వీడియో వైరల్ అయినట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై అత్యాచారం ఆరోపణలతోపాటు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

బాధితురాలి నుంచి శనివారం రాత్రి ఫోన్ వచ్చిందని, ఆ వెంటనే హోంస్టేకు చేరుకుని బాధితురాలిని రక్షించి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. శనివారం రాత్రే ఈ ఘటన జరిగినట్టు సదర్ ఏఎస్పీ అర్చనా సింగ్ చెప్పారు. ఈ ఘటనలో నలుగురు యువకులతోపాటు మరో మహిళను కూడా అరెస్ట్ చేసినట్టు చెప్పారు. హోంస్టే రెంట్‌కు ఇచ్చే ఆస్తులను సీజ్ చేసినట్టు వివరించారు. నిందితులందరూ ఆగ్రాకు చెందినవారేనని పేర్కొన్నారు.


More Telugu News