అపోలో ఆస్పత్రిలో చికిత్స అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

  • తనని చంపాలని చూశారని కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణపై ఆరోపణలు
  • కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మండిపాటు
  • వంశీకృష్ణపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అభ్యర్థన
అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి జరిగిన ఘర్షణపై బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందించారు. అచ్చంపేట కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ తనని చంపాలని చూశారని అన్నారు. తన అనుచరులను చంపినంత పనిచేశారని మండిపడ్డారు.  కాంగ్రెస్‌ గూండాలు తనపై దాడి చేశారని, తన కాన్వాయ్‌ని వెంబడిస్తూ దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అపోలో హాస్పిటల్‌లో చికిత్స తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

వంశీకృష్ణపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తానని అన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఆశయాల కోసం కృషి చేస్తానని ఆయన వివరించారు. తన అదృష్టం, ప్రజల ఆశీస్సులతో ప్రాణాలతో బయటపడ్డానని ఆయన అన్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని, ఇప్పుడు తనపై రాయితో దాడి చేశారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఇదివరకు ఒకసారి తన ఆఫీసుపై దాడి చేశాడని అన్నారు.

ఇదిలావుండగా ఆస్పత్రిలో చికిత్స పొందిన గువ్వల బాలరాజును మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతోపాటు పలువురు నేతలు పరామర్శించారు. రౌడీ రాజకీయాలను సహించేది లేదని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.  ఇదిలావుండగా అచ్చంపేటలో శనివారం రాత్రి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య  ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్‌ శ్రేణులు ఆరోపించాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గాయపడ్డారు.


More Telugu News