కెప్టెన్‌గా బాబర్‌ను తొలగించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • బాబర్‌కు అండగా నిలవాల్సిన సమయమిదని అభిప్రాయపడ్డ మిక్కీ ఆర్థర్
  • జట్టుగా తప్పులు చేశామని, వాటి నుంచి నేర్చుకుంటామని వెల్లడి
  • ప్రపంచ కప్‌లో పెద్దగా రాణించకపోవడంతో స్వదేశంలో బాబర్‌పై తీవ్ర విమర్శలు
పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరుకోకపోవడం, పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను తొలగించాలంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న వేళ  ఆ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజమ్ తన అంతర్జాతీయ క్రికెట్‌ ప్రయాణంలో పాఠం నేర్చుకోవాల్సిన ఒడిదొడుకుల తరుణంలో అండగా నిలవాల్సిన అవసరం ఉందని మిక్కీ ఆర్థర్ సమర్థించాడు. ఇంగ్లండ్ చేతిలో ఓటమితో వరల్డ్ కప్‌లో పాక్ ప్రస్థానం ముగియడంపై మిక్కీ ఆర్థర్‌ స్పందించాడు. పాకిస్థాన్‌ బలమైన జట్టు అని, తాను బాబర్ వెన్నంటే ఉన్నానని, బాబర్ తనకు చాలా దగ్గరగా ఉంటాడని పేర్కొన్నాడు.

బాబర్ ఇప్పటికీ అన్ని సమయాలలోనూ నేర్చుకుంటున్నాడని, అతడు చాలా మంచి బ్యాట్స్‌మెన్ అని, కెప్టెన్సీతో ప్రతిరోజూ నేర్చుకుంటూనే ఉన్నాడని ఆర్థన్ పేర్కొన్నాడు. బాబర్ ఎదుగుతున్నాడని, అతని ఎదుగుదలకు మరింత సమయం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ఒక జట్టుగా ప్రపంచ కప్‌లో చాలా తప్పులు చేశామని, తప్పుల నుంచి నేర్చుకుంటామని పేర్కొన్నాడు. బయట విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.

కాగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ వరల్డ్ కప్ 2023లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. దీంతో కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ స్వదేశంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబర్ ఆజమ్ 1980ల నాటి క్రికెట్ ఆడుతున్నాడని మాజీ కెప్టెన్ రమీజ్ రాజా చాలా తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. మైదానంలో దూకుడుగా ఆడకపోవడంలో ఈ విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 93 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 4 విజయాలు మాత్రమే సాధించింది. దీంతో వరల్డ్ కప్‌ నుంచి  పాకిస్థాన్ నిష్ర్కమించిన విషయం తెలిసిందే.


More Telugu News