కేసీఆర్‌కు సవాలు విసురుతున్న గజ్వేల్, కామారెడ్డి.. కుమార్తె కోసమే కామారెడ్డికా?

  • భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారన్న విపక్షాలు
  • భయం కేసీఆర్ డిక్షనరీలోనే లేదన్న కవిత
  • 2024 ఎన్నికల్లో కవితకు మార్గం సుగమం చేయడమే కేసీఆర్ వ్యూహం
  • గజ్వేల్‌లో రాజేందర్, కామారెడ్డిలో రేవంత్ బరిలోకి
  • కేసీఆర్‌కు కష్టాలు తప్పకపోవచ్చంటున్న విశ్లేషకులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తోపాటు తొలిసారి కామారెడ్డిలోనూ బరిలోకి దిగి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ఇక్కడ గెలుపు అంత తేలిక కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అటు లోక్‌సభ, ఇటు శాసనసభ ఎన్నికల్లో నాలుగు దశాబ్దాలుగా ఓటమన్నదే ఎరుగని నేత కేసీఆర్. అయితే, ఈసారి గజ్వేల్‌లో భయంతోనే కేసీఆర్ కామారెడ్డి పారిపోయారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేశారు. భయం అనే పదమే కేసీఆర్ డిక్షనరీలో లేదని పేర్కొన్నారు. 

కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని, రాష్ట్రంలో ఆయన ఏ నియోజకవర్గాన్ని అయినా ఎంచుకోవచ్చని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. సిద్దిపేట నుంచి ఐదుసార్లు శాసనసభకు ఎన్నికైన కేసీఆర్ తరచూ నియోజకవర్గాలు మారుస్తూ ఉంటారు. గతంలో కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేట లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 

2014 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన సమీప ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి(టీడీపీ)పై 19,391 ఓట్లతో విజయం సాధించారు. అదే ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు.  2018లో గజ్వేల్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈసారి కూడా ఒంటేరు ప్రతాప్‌రెడ్డిపై 58,290 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేశాయి. 2019లో ప్రతాప్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. 

కవిత కోసమే కామారెడ్డికి!
ఈసారి బీఆర్ఎస్ నేత గంప గోవర్ధన్ అభ్యర్థనతో కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలోనూ బరిలోకి దిగారు. 2014లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన కేసీఆర్ కుమార్తె కవిత.. 2014లో మాత్రం బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం వెనక ఓ కారణం కూడా ఉందని చెబుతున్నారు. కామారెడ్డిలో విజయం సాధించడం ద్వారా 2024 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బరిలోకి దిగే కుమార్తె కవితకు మార్గం సుగమం చేయడమే కేసీఆర్ లక్ష్యమని రాజకీయ విశ్లేషకుల మాట. దీనికి తోడు కేసీఆర్‌కు కామారెడ్డితో ఇది వరకే సంబంధం ఉంది. మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో స్థిరపడడానికి ముందు కేసీఆర్ కుటుంబం కామారెడ్డిలోని కోనాపూర్‌లోనే నివసించేది.  

గజ్వేల్‌లో బరిలో హెవీవెయిట్స్
ఈసారి గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు నల్లేరు మీద నడక కాకపోవచ్చు. ఇదే స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి టి. నరసారెడ్డి బరిలో నిలిచారు. బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినప్పటికీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడాయన నేరుగా కేసీఆర్‌తోనే తలపడుతున్నారు. 

నరసారెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించారు. మరోవైపు, కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌కు సవాలు విసురుతున్నారు. 2018 ఎన్నికల్లో కొడంగల్‌లో ఓటమి పాలైన రేవంత్‌రెడ్డి.. ఆ వెంటనే 2019లో మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కొడంగల్‌తోపాటు కామారెడ్డిలోనూ రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌కు సవాలు విసురుతున్నారు. ఇక, కామారెడ్డి నుంచి రెండుసార్లు గెలుపొందిన కాంగ్రెస్  సీనియర్ నేత షబ్బీర్ అలీ.. రేవంత్ రెడ్డి కోసం నిజమామాద్ అర్బన్‌కు షిఫ్టయ్యారు.   


More Telugu News