సమాజంలో శాంతి సౌభాగ్యాలు నిండాలి.. ప్రజలకు ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు

  • సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఏపీ టీడీపీ యువనేత లోకేశ్ దీపావళి శుభాకాంక్షలు
  • బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలన్న కేసీఆర్
  • అసలైన పండుగ 30న ఉందన్న కేటీఆర్
  • సమాజంలో చెడు ఏ రూపంలో ఉన్నా దానిపై విజయం సాధించడమే అసలైన దీపావళి అన్న లోకేశ్
తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఏపీ టీడీపీ యువనేత నారా లోకేశ్ తదితరులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. స్వయం విశ్వాసాన్ని ప్రోత్సహించేందుకు స్థానిక వ్యాపారులు, తయారీదారులకు మద్దతు ఇవ్వాలని కోరారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ.. సంకల్పం, చైతన్యంతో ముందుకు సాగేందుకు దీపావళి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. హిందూ సంస్కృతిలో దీపావళిని విజయానికి ప్రతీకగా భావిస్తారని, అది మన జీవితాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. బాణసంచా కాల్చేటప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని, తద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలని కోరారు. 

మంత్రి కేటీఆర్ తన దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలన్నారు. దీపావళి కంటే పెద్ద పండుగ ఈ నెల 30న ఉందని, అదే ఓట్ల పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొని కారు గుర్తుకు ఓటేసి తెలంగాణను గెలిపించాలని కోరారు. 

ఏపీ టీడీపీ యువనేత నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అజ్ఞానం, అవినీతి, అరాచ‌కం, అహంకారం అనే చీక‌ట్ల‌ను చీల్చే వెలుగుల పండ‌గ‌ దీపావ‌ళి అని పేర్కొన్నారు. స‌మాజంలో చెడు ఏ రూపంలో ఉన్నా దానిపై విజ‌యం సాధించ‌డ‌మే అస‌లైన దీపాల‌ పండ‌గ‌ అని తెలిపారు. సుర‌క్షితంగా, సంతోషంగా పండ‌గ జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు.


More Telugu News