భువనగిరి కలెక్టరేట్‌లో కత్తిపోట్ల కలకలం.. ఏఈవోపై మహిళా అధికారి కత్తితో దాడి.. ప్రేమ వ్యవహారమే కారణం!

  • పెళ్లయిన మహిళతో రెండున్నరేళ్లుగా ఏఈవో మనోజ్ ప్రేమాయణం
  • విషయం తెలిసి మందలించిన మనోజ్ కుటుంబ సభ్యులు
  • అప్పటి నుంచి శిల్పకు దూరంగా ఉంటున్న ఏఈవో
  • రెండు నెలల సెలవుల అనంతరం నిన్న ఆఫీసుకు వచ్చిన మనోజ్‌పై కత్తితో దాడి
  • తాము రహస్యంగా పెళ్లి చేసుకున్నామన్న నిందితురాలు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో కత్తిపోట్లు కలకలం రేపాయి. ప్రేమ వ్యవహారంపై మహిళా ఉద్యోగి ఒకరు మరో అధికారిపై కత్తితో దాడిచేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  ఎన్.శిల్ప 2018 నుంచి ఆత్మకూరు (ఎం) మండల వ్యవసాయాధికారి(ఏవో)గా పనిచేస్తున్నారు. అదే మండలంలోని పల్లపహాడ్ వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)గా మనోజ్ పనిచేస్తున్నారు. శిల్పకు 2012లో వివాహం జరగ్గా రెండున్నరేళ్ల బాబు కూడా ఉన్నాడు. 

అయినప్పటికీ, శిల్ప-మనోజ్ మధ్య రెండున్నరేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. విషయం మనోజ్ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు అతడిని మందలించారు. అప్పటి నుంచి అతడు ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. మూడు నెలల క్రితం యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేటకు డిప్యుటేషన్‌పై వెళ్లిన మనోజ్ తర్వాత రెండు నెలలు సెలవు పెట్టారు. నిన్న మధ్యాహ్నం తిరిగి విధులకు హాజరయ్యేందుకు కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి వచ్చారు. అతడితో మాట్లాడేందుకు శిల్ప ప్రయత్నించగా అది వాగ్వివాదానికి దారితీసింది. ఘర్షణ జరుగుతుండగానే శిల్ప అకస్మాత్తుగా కత్తితీసి అతడిపై దాడిచేసింది. మెడ, వీపు భాగాలపై గాయాలు కావడంతో మనోజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

బాబును చంపేస్తానని బెదిరించాడు
ఈ ఘటనపై శిల్ప మాట్లాడుతూ.. మనోజ్‌తో తాను రిలేషన్‌లో ఉన్నానని, నిరుడు జూన్ 7న ఇద్దరం రహస్యంగా వివాహం కూడా చేసుకున్నామని పేర్కొన్నారు. భర్తకు విడాకులిచ్చి తనతోనే ఉండాలని మనోజ్ ఒత్తిడి చేశాడని, బాబును కూడా తీసుకొస్తానంటే చంపేస్తానని బెదిరించాడని శిల్ప ఆరోపించారు. తొలుత మనోజ్ తనపై కత్తితో దాడిచేస్తే ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేశానని చెప్పారు. శిల్పపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News