రెండేళ్లుగా క్రియాశీలకంగా లేని జీమెయిల్ అకౌంట్ల తొలగింపు!

  • సుదీర్ఘకాలంగా యాక్టివిటీ లేని జీమెయిల్ ఖాతాలపై దృష్టి సారించిన గూగుల్
  • మొదట హెచ్చరికలు పంపుతామని వెల్లడి
  • అప్పటికీ స్పందించకపోతే వాటిని శాశ్వతంగా డిలీట్ చేస్తామని స్పష్టీకరణ
గత రెండేళ్లుగా ఎలాంటి కదలిక లేని జీమెయిల్ ఖాతాలపై టెక్ దిగ్గజం గూగుల్ దృష్టి సారించింది. వాటిని డిలీట్ చేసేందుకు సిద్ధమైంది.

ఇలాంటి ఖాతాలకు పాస్ వర్డ్ ఉన్నప్పటికీ, వాటికి రెండంచెల భద్రత (టు ఫ్యాక్టర్ అథెంటికేషన్) ఉండదని, ఈ ఖాతాల కారణంగా భద్రత, వ్యక్తిగత గోప్యతకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని గూగుల్ భావిస్తోంది. ఈ ఖాతాలను ఇప్పటికే ఎవరైనా దుర్వినియోగం చేసి ఉంటే, అందువల్ల కూడా ఇబ్బందులు రావొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

అందుకే, చాలాకాలంగా క్రియాశీలకంగా లేని ఖాతాలను గుర్తించి వాటిని తొలగించాలని నిర్ణయించింది. అయితే, ఈ చర్యలు వ్యక్తిగత జీమెయిల్ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తాయని, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థల జీమెయిల్ ఖాతాల జోలికి వెళ్లబోవడంలేదని గూగుల్ స్పష్టం చేసింది. అంతేకాదు, యూట్యూబ్ వీడియోలతో అనుసంధానమై ఉన్న జీమెయిల్ ఖాతాలను తొలగించబోమని వెల్లడించింది. 

యాక్టివిటీ లేని జీమెయిల్ అకౌంట్లను గుర్తించి, ఆయా ఖాతాలకు, వాటి రికవరీ మెయిల్ అకౌంట్లకు కొన్ని నెలల పాటు తొలగింపు సందేశాలు పంపుతామని గూగుల్ వివరించింది. అప్పటికీ స్పందించకపోతే, వాటిని శాశ్వతంగా డిలీట్ చేస్తామని స్పష్టం చేసింది. 

కాగా, జీమెయిల్ ఖాతాల ప్రక్షాళన కార్యక్రమం ఈ ఏడాది డిసెంబరు నుంచి దశల వారీగా అమల్లోకి రానుంది.


More Telugu News